భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ భద్రాచలం/ దుమ్ముగూడెం, మే 4: గ్రామాల్లోని ప్రజలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు వెన్నెముక లాంటివని పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా పేర్కొన్నారు. ఈ శాఖల ఉద్యోగులు తమ విధుల్లో అలసత్వం వహించొద్దని సూచించారు. ఏమరపాటుగా ఉంటే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ శాఖల ఉద్యోగులు ప్రత్యేక శ్రద్ధతో గ్రామాలకు వెళ్లాలని, అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా భద్రాద్రి జిల్లాలో చేపడుతున్న వివిధ పనుల పురోగతిపై డైరెక్టర్ హనుమంతరావు, స్పెషల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్ శెట్టి, కలెక్టర్ అనుదీప్‌తో కలిసి జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఐకేపీ ఏపీఎంలు, సీసీలతో భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో పంచాయతీ రాజ్ శాఖ ద్వారా చేపట్టే పనుల పర్యవేక్షణకు ఎంపీహెచ్‌వోలు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఎంపీహెచ్‌వోలు గ్రామ సెక్రటరీల సాయంతో గ్రామాల్లో చేపట్టే పనులను పరిశీలించాలని, పనుల జీపీఎస్ లోకేషన్‌ను, ఫొటోలను 15 రోజుల్లో తనకు పంపించాలని ఆదేశించారు. డీఆర్డీఏ ద్వారా బ్యాంకు లింకేజీకి సంబంధించిన గ్రూపులు నమ్మకంగా విధులు నిర్వహించాలని, ఇందుకోసం ఏపీఎంలు మహిళలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. డ్వాక్రా సంఘాలు బలోపేతమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. హరితహారం కార్యక్రమంతో గ్రామాలన్నీ పచ్చదనాన్ని సంతరించుకున్నాయని అన్నారు. జాతీయస్థాయిలో భద్రాద్రికి స్వచ్ఛ సర్వేక్షణ్ జిల్లాగా పేరు వచ్చిందని గుర్తుచేశారు. అభివృద్ధిలో జిల్లాను మరింత ముందు వరుసలో నిలిపేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు.
అనంతరం పీఆర్ డైరెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పరిశుభ్రత ఉన్నచోట రోగాలు దరిచేరవని అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్, పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాల్లో భద్రాద్రి జిల్లా అగ్రగామిగా గొప్ప విషయమని అన్నారు. ఇందుకు కృషి చేసిన కలెక్టర్, అధికారులు అభినందనీయులని అన్నారు. కొన్ని వైకుంఠధామాల్లో కరెంట్, నీటి సౌకర్యం లేని విషయం తమ దృష్టికి వచ్చిందని అన్నారు. వాటిని వెంటనే పరిష్కరించాలని సూచించారు. అనంతరం జిల్లాలో జరుగుతున్న పనుల గురించి అంశాల వారీగా పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా కలెక్టర్ అనుదీప్ వివరించారు. డీపీవో రమాకాంత్, డీఆర్డీవో మధుసూదన్‌రాజు, భద్రాచలం ప్రత్యేక అధికారి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కాగా, భద్రాచలం జగదీశ్కాలనీ ఉదయ గ్రూప్ మహిళలు ఎస్బీఐ ద్వారా రూ. 1.5 లక్షలు రుణం తీసుకొని చిత్ర స్వీట్, కారా యూనిట్ ఏర్పాటు చేసుకోగా ఆయన యూనిట్‌ను సుల్తానీయా పరిశీలించారు. ఈ మహిళలు నెలకు రూ.లక్ష టర్నోవర్ చేస్తూ మరో 10 మంది మహిళలకు ఉపాధి కలిపించడం అభినందనీయమని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకున్నప్పుడే సార్థకత ఉంటుందని పీఆర్ అండ్ ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా అన్నారు. దుమ్ముగూడెం మండలంలోని తూరుబాక పంచాయతీలో గురువారం పర్యటించిన ఆయన.. డంపింగ్షెడ్, వైకుంఠధామాలను పరిశీలించారు. డంపింగ్‌షెడ్‌లో సేంద్రియ ఎరువు తయారీ విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. వైకుంఠధామం వద్ద సౌకర్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో మాట్లాడుతూ.. పల్లె ప్రగతిలో గ్రామాల రూపురేఖలు మారాయని అన్నారు. పల్లెల్లో ప్రతి రోజూ పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. డైరెక్టర్ హనుమంతరావు, కలెక్టర్ అనుదీప్, స్పెషల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, డీపీవో రమాకాంత్, డీఆర్డీవో మధుసూదన్‌రాజు, జడ్పీ సీఈవో విద్యాలత, ఎంపీడీవో ముత్యాలరావు, సర్పంచ్ చందు, అధికారులు పాల్గొన్నారు.
భద్రాచలం సీతారామచంద్రస్వామివారిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి నామవరపు రాజేశ్వరరావు, పీఆర్ అండ్ ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా వేర్వేరుగా దర్శించుకున్నారు.