మణుగూరు పినపాక మార్గం ఆసాంతం ప్రధాన రహదారిగా కాకుండా ఇసుక లారీల అడ్డాగా కన్పిస్తోంది. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం కోసం నిర్మించిన ప్రధాన రోడ్డు మార్గాన్ని ఇసుక లారీలు అమాంతంగా ఆక్రమించాయి. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు చివరికి ప్రమాదాలకు గురికావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
చివరికి ప్రాణాధారమైన అంబులెన్సుల రాకపోకలకు కూడా తీవ్రమైన ఆటంకాన్ని కలిగిస్తున్న ఆ మార్గం.. నిత్యం ప్రమాదభరితంగా పరిణమించింది. ఈ చిత్రాలే ఇందుకు నిదర్శనంగా కన్పిస్తున్నాయి. ప్రాణాపాయ స్థితిలో నిమిషాల వ్యవధిలో చేరుకోవాల్సిన అంబులెన్స్ వాహనం కూడా రెండు గంటలపాటు ఈ ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకొని కొట్టుమిట్టాడిందంటే అతిశయోక్తి కాదు. పినపాక నియోజకవర్గ కేంద్రమైన మణుగూరులోని రామానుజవరం, సాంబాయిగూడెం ఇసుక ర్యాంపులకు వెళ్లి వచ్చేందుకు మణుగూరు పినపాక మార్గంలో ప్రధాన రహదారి వెంబడి శుక్రవారం కూడా కిలోమీటర్ల మేర నిలిచి ఉన్న ఈ ఇసుక లారీలే.. ట్రాఫిక్ తీవ్రత కారణానికి ప్రధాన సాక్ష్యాలు.
-మణుగూరు టౌన్, మే 23