ఖమ్మం, మే 21: జిల్లాలో ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు రానీయొద్దని, వారికి సమస్యలు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లు జరపాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేక అధికారి, రాష్ట్ర గనులు, భూగర్భ శాఖల కార్యదర్శి సురేంద్రమోహన్ ఆదేశించారు. ‘ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరా, అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల పురోగతి, గనులు, భూగర్భ శాఖల లక్ష్యాలు’ తదితర అంశాలపై ఖమ్మం ఐడీవోసీలో కలెక్టర్ వీపీ గౌతమ్‌తో కలిసి సంబంధిత అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు సకల సదుపాయాలు కల్పించాలని సూచించారు. తాగునీటి సరఫరాలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ముందస్తు చర్యలు చేపట్టిన కలెక్టర్, అధికారులను అభినందనీయులని అన్నారు. తాగునీటికి అవసరమైతే స్థానిక వనరులను ఉపయోగంలోకి తెచ్చుకోవాలని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను పాఠశాలల పునఃప్రారంభంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. గనులు, భూగర్భ వనరుల శాఖలో రెవెన్యూ వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఇసుక అక్రమ రవాణాను పకడ్బందీగా నియంత్రించాలని ఆదేశించారు.
ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. జిల్లాలో 1,20,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు అంచనా ఉందని, ఇప్పటికే 20,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 157 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ 90 కేంద్రాల్లోనే కొనుగోళ్లు జరిగినట్లు చెప్పారు. మిల్లర్లు, వ్యాపారులు కనీస మద్దతు ధర కంటే ఎకువ ధర చెల్లించి రైతుల కల్లాల వద్దే ధాన్యం కొనుగోలు చేస్తున్నారని అన్నారు. అందుకే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్దకు ధాన్యం రావడం తగ్గిందని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కింద జిల్లాలో 753 పాఠశాలల్లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేశామని అన్నారు.
అనంతరం అదనపు కలెక్టర్ డీ.మధుసూదన్‌నాయక్‌తో కలిసి వైరా వెళ్లిన ప్రత్యేకాధికారి సురేంద్రమోహన్.. అక్కడ డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. అక్కడి రైతులతో మాట్లాడి ధాన్యం కొనుగోలు వివరాలు తెలుసుకున్నారు. అధికారులు అన్ని వసతులూ కల్పించారని, మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారని అన్నదాతలు సమాధానమిచ్చారు. యాసంగి లక్ష్యం మేరకు ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని, అకాల వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ రైతుల వద్ద నుంచి త్వరితగతిన ధాన్యం కొనుగోలును పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే, కొణిజర్ల విజయలక్ష్మి పారా బాయిల్డ్ రైస్ మిల్లును తనిఖీ చేశారు. ఒప్పందం మేరకు సీఎంఆర్ రైస్ అందించాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్లు సత్యప్రసాద్, మధుసూదన్‌నాయక్, వివిధ శాఖల అధికారులు విజయనిర్మల, చందన్‌కుమార్, సయ్యద్ ఖుర్షీద్, ఆఫ్రీన్ సిద్ధికీ, అలీమ్, శ్రీలత, సదాశివకుమార్, పుష్పలత, వాణిశ్రీ, సరిత, నూరొద్దీన్, రంగప్రసాద్నాయక్ తదితరులు పాల్గొన్నారు.