కూసుమంచి, డిసెంబర్ 26:ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నూతనంగా ఏర్పడిన పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. మొత్తం 292 పంచాయతీల్లో నూతన భవనాల నిర్మాణాలకు రూ.58.40 కోట్లను కేటాయించింది. ఒక్కో భవన నిర్మాణానికి రూ.20 లక్షలను వెచ్చించింది. వెయ్యి గజాల స్థలంలో సకల సదుపాయాలతో వీటిని నిర్మించనున్నది. గ్రామీణ ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో ఒకే నమూనాలో ఇవి రూపుదిద్దుకోనున్నాయి. కొత్తగా ఏర్పడిన పంచాయతీలకు నూతన భవనాలు మంజూరు కావడంతో ఆయా గ్రామాల ప్రజలు, పాలకవర్గాల బాధ్యులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
పల్లెల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే పల్లె ప్రగతి సహా అనేక పథకాలు అమలు చేస్తోంది. దీనికితోడు మారుమూల, గిరిజన పల్లెల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్.. 500 జనాభా ఉన్న గ్రామాలను నూతన పంచాయతీలుగా రూపొందించారు. పంచాయతీల వికేంద్రీకరణ అనంతరం 2019లో అన్నింటికీ కలిపి ఎన్నికలు నిర్వహించి నూతన పాలకవర్గాలకు బాధ్యతలు అప్పగించారు. ఎప్పటికప్పుడు నిధులనూ విడుదల చేస్తున్నారు. వీటన్నింటి కారణంగా ఇప్పటికే గ్రామాల రూపురేఖలు మారిపోతున్నాయి. ఈ క్రమంలో ఆయా గ్రామ పంచాయతీల భవనాల సమస్యపై దృష్టి సారించిన ఆయన.. వాటన్నింటికీ నూతన భవనాలు నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. దీంతో కొన్ని గ్రామాల్లో అద్దె భవనాల్లో కొనసాగుతున్న పంచాయతీలన్నీ మరికొన్ని రోజుల్లో సొంత భవనాల్లోకి మారనున్నాయి.
292 నూతన భవనాలు..
తొలి విడతగా ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో 292 నూతన భవనాలు మంజూరయ్యాయి. వాటిల్లో అత్యధికంగా కొత్తగూడెం నియోజకవర్గంలో 40 పంచాయతీ భవనాలు, అత్యల్పంగా ఖమ్మం నియోజకవర్గంలో 10 పంచాయతీ భవనాలు మంజూరయ్యాయి.
నిధులు మంజూరు అభినందనీయం
పల్లెల్లో ప్రగతి పరుగులు పెడుతున్నది. పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామాల రూపురేఖలు మార్చేసింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట మేరకు తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి అభివృద్ధికి బాటలు వేశారు. మా గ్రామ పంచాయతీ చాలా సంవత్సరాల కిందటే ఏర్పడింది. కానీ భవనం శిథిలమై కూలి పోయేలా ఉంది. దీనిస్థానంలో కొత్త భవనం నిర్మించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షల నిధులను మంజూరు చేయడం అభినందనీయం. గ్రామాలకు దూరంగా ఉన్న గిరిజన తండాలను పంచాయతీలుగా చేశాకే అభివృద్ధి చేసుకోగలుగుతున్నాం. ప్రభుత్వం అందించే నిధులతో అన్ని సౌకర్యాలతో కూడిన నూతన భవనాన్ని నిర్మించుకుంటాం.
–బానోత్ సరస్వతి, గోరీలపాడుతండా సర్పంచ్
గ్రామాల్లో రూపురేఖలు మారుతున్నాయి..
గతంలో మా గ్రామం పెద్ద పంచాయతీగా ఉండేది. పరిపాలనా సౌలభ్యం కోసం ఆ గ్రామం నుంచి రెండు పల్లెలను విడదీసి పడమ టితండా, అజ్మీరాతండా పంచాయతీలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు కొత్త గ్రామాలన్నింటికీ నూతన పంచాయతీ భవనాలు మంజూరు చేయడం సంతోషదాయకం. పంచాయతీలకు సకల సదుపాయాలతో కూడిన సొంత భవనాలు ఉంటే మరింత మెరుగైన పాలన అందించేందుకు వీలవుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి.
–మట్టా కరుణశ్రీ, సర్పంచ్, హైదర్సాయిపేట, తిరుమలాయపాలెం
కొత్త భవనాలు నిర్మించడం గొప్ప విషయం..
గ్రామాల్లో గతంలో ఎప్పుడో నిర్మించిన పంచాయతీ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు సొంత పక్కా భవనాలు లేవు. దీంతో పంచాయతీ సమావేశాలు, ఇతర అధికారిక కార్యక్రమాల నిర్వహణకు రెండు చోట్లా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీ భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఒక్కో పంచాయతీ భవన నిర్మాణానికి రూ.20 లక్షలు కేటాయిస్తుండడంతో అన్ని సౌకర్యాలతో కూడిన కొత్త భవనాన్ని నిర్మించుకుంటాం. గ్రామ అభివృద్ధి కోసం మరింత పట్టుదలతో పనిచేస్తాం.
–గండు సతీశ్, అమ్మగూడెం సర్పంచ్
చాలా సంతోషంగా ఉంది..
సీఎం కేసీఆర్ మా తండాను పంచాయతీగా చేయడంతో మేమే పరిపాలన చేసుకుంటున్నాం. ఇప్పుడు మా గ్రామానికి కొత్తగా పంచాయతీ భవనాన్ని మంజూరు చేయడం సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పంచాయతీకి ట్రాక్టర్ను కొనుగోలు చేశాం. వైకుంఠధామం, డంపింగ్ యార్డు నిర్మించుకున్నాం. నర్సరీని ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు నూతన పంచాయతీ భవనం వస్తే మా గ్రామానికి మరింత మెరుగైన పాలన అందించుకుంటాం.
–జర్పుల పింప్లీ, సర్పంచ్, ధర్మాతండా, కూసుమంచి