కారేపల్లి, జనవరి 23 : ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని మాణిక్యారం కోయగుంపులో గల సమ్మక్క సారలమ్మ జాతరను శుక్రవారం వైరా మాజీ ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ ప్రారంభించారు. ఆదివాసి కోయ గిరిజనుల ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న మినీ మేడారం జాతర ప్రారంభోత్సవానికి విచ్చేసిన మాజీ ఎమ్మెల్యేకు స్థానిక గిరిజనులు సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద రాములు నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన పెద్దలతో పాటు స్థానిక సర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.