HomeKhammamSalary Of The Sarpanches Goes Directly Into The Accounts
సర్పంచ్ల ‘గౌరవ వేతనం’నేరుగా ఖాతాల్లోకి..
గ్రామీణులకు సేవలందిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్న సర్పంచ్ల గౌరవవేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని నిర్ణయం తీసుకున్నది. గతంలో వీరి వేతనాలు గ్రామపంచాయతీ అకౌంట్లో జమ అయ్యేది. సర్పంచులు చెక్కులు రాసి డబ్బులు డ్రా చేసుకోవాల్సి వచ్చేది. ఇక మీదట అలా కాకుండా నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సర్పంచ్‌లు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
వివరాలు సేకరిస్తున్న అధికారులు
మార్చి నుంచి అమలు
ప్రజాప్రతినిధులందరికీ ఇదే పద్ధతిలో వేతనం
ఖమ్మం, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గ్రామీణులకు సేవలందిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్న సర్పంచ్ల గౌరవవేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని నిర్ణయం తీసుకున్నది. గతంలో వీరి వేతనాలు గ్రామపంచాయతీ అకౌంట్లో జమ అయ్యేది. సర్పంచులు చెక్కులు రాసి డబ్బులు డ్రా చేసుకోవాల్సి వచ్చేది. ఇక మీదట అలా కాకుండా నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సర్పంచ్‌లు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో 589 గ్రామపంచాయతీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 465 పంచాయతీలకు సర్పంచ్‌లు ఉన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుల గౌరవవేతనాన్ని 30 శాతం వరకు పెంచింది. ఇది ఇప్పటికే అమలులో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు ఇప్పటికే ఆయా పురపాలికల ద్వారా వారి ఖాతాల్లో జమచేస్తోంది. వీరికి కూడా గౌరవ వేతనాన్ని పెంచింది. గతంలో సర్పంచ్‌కు రూ.5 వేల గౌరవవేతనం ఉండగా రూ.6,500లకు పెంచింది. మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు(ఎంపీపీ) రూ.10 వేల గౌరవ వేతనం రూ.13 వేలు, జడ్పీటీసీల గౌరవవేతనం రూ.10 వేల నుంచి రూ.13 వేలు, ఎంపీటీసీల గౌరవ వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.6,500లకు పెంచింది. మార్చి నుంచి సర్పంచ్ల ఖాతాల్లో గౌరవ వేతనం జమకానున్నది. దీంతో క్షేత్రస్థాయిలో అధికారులు సర్పంచ్ల బ్యాంకు అకౌంట్ వివరాలు సేకరిస్తున్నారు. గౌరవ వేతనాన్ని ప్రతినెలా సర్పంచ్ల ఖాతాల్లో జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్‌కు గౌరవ వేతనం జిల్లా పరిషత్ ద్వారా తీసుకోవాల్సి వచ్చేది. ఈ విధానాన్ని సైతం మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా పరిషత్ చైర్మన్‌తోపాటు ఎంపీపీ, ఎంపీటీసీ, జడ్పీటీసీల గౌరవ వేతనాలను నేరుగా పంచాయతీరాజ్ కమిషనర్ ద్వారా వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమచేసేలా ఏర్పాట్లు చేస్తున్నది. ప్రస్తుతం ఎంపీటీసీ, జడ్పీటీసీలకు వారి బ్యాంకు ఖాతాల్లో గౌరవ వేతనం జిల్లా పరిషత్ ద్వారా జమఅవుతున్నది. మారిన విధానం ప్రకారం వివిధ ప్రజాప్రతినిధులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో గౌరవ వేతనం జమకానున్నది.
రెండుసార్లు పెరిగిన గౌరవ వేతనం
రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాన్ని రెండు సార్లు పెంచింది. సర్పంచ్‌లకు గతంలో రూ.1,000 మాత్రమే ఉండేది. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పడిన గ్రామపంచాయతీ కొత్త పాలకవర్గాలకు రూ.5 వేల గౌరవ వేతనం ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకటించిన సమయంలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్, ఎంపీపీ, కో-ఆప్షన్ సభ్యులకు గౌరవ వేతనం పెంచింది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఏదైనా సర్పంచ్ 15 రోజులపాటు విధుల్లో లేకపోతే ఆ నెలలో సగం వేతనాన్ని ఇన్చార్జి సర్పంచ్‌గా వ్యవహరించే ఉపసర్పంచ్‌కు ఇవ్వనున్నారు. ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందే సర్పంచ్, ఉపసర్పంచ్ వివరాలతోపాటు వారి బ్యాంకు ఖాతాలు, ఐఎఫ్ఎస్సీ కోడ్ వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. మండలాల వారీగా వివరాలు సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించనున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీలకు సంబంధించి గౌరవవేతనాలు ఇక నుంచి నేరుగా పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలోనే బిల్లులు చేసి ఆయా ప్రజాప్రతినిధుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్నారు.