కూసుమంచి, డిసెంబర్ 19 : సాగర్ ఆయకట్టు పరిధిలో యాసంగి సాగుకు నీటి విడుదల షెడ్యూల్‌ను నీటిపారుదల శాఖ అధికారులు ఖరారు చేశారు. వారబందీ పద్ధతిలో వారానికి ఒకసారి ఆన్, ఆఫ్ పద్ధతిలో నీరు ఇవ్వాలని నిర్ణయించారు. అధికారికంగా ఆరుతడి పంటలకే నీరు అని ప్రకటిస్తున్నా.. సాగర్ ఆయకట్టు కింద ఉన్న 17 మండలాల్లో 2.54 లక్షల ఎకరాలకు నీటిని విడుదల చేయనున్నారు. నాగార్జున సాగర్ నుంచి యాసంగి సాగు కోసం అధికారులు కృష్ణా జలాలను ఈ నెల 15న వదలడంతో మంగళవారం ఆ నీరు పాలేరు జలాశయానికి చేరింది. ఇప్పటికే నీటిని జిల్లాకు ఇస్తుండడంతో ఈసారి నీటి విడుదలను అధికారికంగా వదిలే అవకాశాలు లేవు. అయితే పాలేరు నీటిమట్టం 21 అడుగులకు తగ్గకుండా అధికారులు చర్యలు చేపట్టారు. వచ్చే ఏప్రిల్ 23 వరకు సాగునీరు ఇవ్వనున్నారు.
పాలేరు రిజర్వాయర్ నుంచి యాసంగి సాగుకు నీటిని విడుదల చేశారు. గత వానకాలం పూర్తిస్థాయిలో పంటలు పండగా.. యాసంగికి కూడా పూర్తి అయకట్టు రైతులు వరి నాట్లకు సిద్ధమయ్యారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే నాట్లు వేయగా.. మరికొన్ని ప్రాంతాల్లో కరిగట్లు చేస్తున్నారు. సాగర్ నుంచి 4,328 క్యూసెక్కుల నీరు పాలేరు రిజర్వాయర్‌కు రావడంతో 14 అడుగులు ఉన్న నీటిమట్టం క్రమంగా పెరిగి గురువారం నాటికి 17 అడుగులకు చేరింది. దీంతో మిషన్ భగీరథకు 135 క్యూసెక్కులు, పాలేరు పాత కాల్వకు 150 క్యూసెక్కులు, భక్త రామదాసు ప్రాజెక్టుకు 275 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జిల్లాలోని కల్లూరు వరకు ప్రధాన కాల్వ కింద ఉన్న సాగర్ రెండో జోన్‌లోని రైతుల కోసం 3,382 క్యూసెక్కుల నీటిని వదుతున్నారు. ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో మధ్య 380 క్యూసెక్కుల వ్యత్యాసం ఉండడంతో క్రమంగా పాలేరును పెంచాలని ఇరిగేషన్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. పాలేరు పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 18 అడుగులు ఉంది.
సాగర్ ఎడమ కాల్వ కింద గల రెండో జోన్ ఖమ్మం జిల్లా రైతులకు వారబందీ పద్ధతిలో మాత్రమే నీటిని విడుదల చేయాలని హైదరాబాద్‌లో జరిగిన శివం సమావేశంలో అధికారులు నిర్ణయించారు. అయితే ఇప్పటికే విడుదలవుతున్న నీటిని యాసంగికి వాడుకోవాలని సూచించారు. ఒక వారం నీరు ఇచ్చి.. మరో వారం నీటిని నిలిపివేస్తారు. ఈ తరహాలో మొత్తం 7 దఫాలుగా నీరు ఇస్తారు. సుమారు వంద రోజులపాటు సాగర్ ఆయకట్టు కింద పంటలు చేతికొస్తాయనే ఆలోచనతో అధికారులు అంచనాలు ఇలా రూపొందించారు. సాగర్ మొదటి జోన్లో ఇచ్చిన షెడ్యూల్‌నే రెండో జోన్లో కూడా అమలు చేయనున్నారు.
మళ్లీ వేసవిలో నీటి కొరత ఏర్పడుతుందనే ఆలోచనతో ఈసారి రైతులు యాసంగి ముందే సాగు చేశారు. ఆయకట్టు పరిధిలో వందలాది మంది రైతులు పొలాల్ల్లో నాట్లు, కరిగట్లు, వరాలు చెక్కడం, దమ్ము చేయడం, నారు తీయడం, వెదజల్లడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. పాలేరు పాత కాల్వ కింద, భక్త రామదాసు ఎత్తిపోతల కింద గల ఆయకట్టుకు యాసంగికి నీటిని విడుదల చేశారు. రెండు, మూడు రోజుల్లో యాసంగి నీటి విడుదల వారబంధీ షెడ్యూల్ ఖరారు చేస్తామని ఎస్ఈ మంగళంపూడి వెంకటేశ్వరరావు తెలిపారు.