ఖమ్మం వ్యవసాయం, డిసెంబర్ 12: యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధు పథకం పంటల పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ అవుతోంది. మంగళవారం నుంచి ఈ ప్రక్రియ మొదలైంది. అయితే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన తరహాలోనే ఈ సీజన్తకు రైతుబంధు సాయం అందజేస్తామని ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగానే తొలిరోజున ఎకరం లోపు భూమి కలిగిన పలువురు రైతులకు పంటల సాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. అయితే ఎంతమంది రైతులకు ఎంత మేరకు సొమ్ము జమ అయిందనే వివరాలు నమోదు కాలేదు.
ఇదే విషయంపై జిల్లా వ్యవసాయశాఖ అధికారులను వివరణ కోరగా.. రైతుబంధు నిధుల జమ వివరాలు అప్డేట్ కాలేదని సమాధానమిచ్చారు. కాగా, పలు మండలాల్లో మాత్రం ఎకరంలోపున్న కొందరు రైతుల ఖాతాల్లో రూ.2,500 చొప్పున జమ అయినట్లు తెలిసింది. ఈ సంవత్సరం యాసంగి సీజన్లో మొత్తం 3,42,799 మంది రైతులకు రూ.370.29 కోట్లు జమ చేయాల్సి ఉంది. పంటల పెట్టుబడి విడతల వారీగా అందజేస్తారో, లేదా మరే ఇతర పద్ధతి ద్వారా అమలు చేస్తారో అనే విషయం రెండు రోజుల్లో స్పష్టం వచ్చే అవకాశముంది.