కారేపల్లి, నవంబర్ 12 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేయడం లేదని, ప్రధాని మోదీ విధానాలతో దేశంలో మహిళల హక్కులు రోజురోజుకు హరించుకు పోతున్నాయని ఐద్వా ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు మెరుగు రమణ, కొండబోయిన ఉమాపతి అన్నారు. హైదరాబాద్లో ఈ నెల 25 నుండి 28వ తేది వరకు జరగనున్న ఐద్వా జాతీయ మహా సభలను విజయవంతం చేయాలని కోరుతూ బుధవారం కారేపల్లి మండలం మాణిక్యారం గ్రామంలో కరపటి సీతమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. మహిళా రక్షణకు చట్టాలు ఉన్నా ఆగంతులకు పాలకులు కొమ్ముకాస్తుండంతో మహిళలకు భద్రత కరువైందన్నారు. చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ బిల్లుపై వామపక్షాలు మినహా మిగతా పార్టీలకు చిత్తశుద్ది లేదన్నారు.
బాలికలపై హింస పెరిగిందని, మహిళల అశ్లీల చిత్రీకరణ నిరోదానికి, మహిళా భద్రతకు కఠినమైన చట్టాలు తేవాలని డిమాండ్ చేశారు. సామాజిక వ్యవస్థలో మార్పు రావాలని దానికి మహిళలు చెతన్యవంతులుగా పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలలో ఉచిత బస్సు ప్రయాణం మినహా మిగతా హామీలను అమల్లోకి తీసుకురాలేదని, తక్షణమే ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలన్నారు. మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఐద్వా జాతీయ మహా సభలకు జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీమతి టీచరు, మరియం దావలె, కోశాధికారి ఎస్.పుణ్యవతి, ఉపాధ్యక్షురాలు సుధాసుందరరామన్ వంటి నాయకులు హాజరవుతున్నట్లు తెలిపారు. మహాసభల విజయవంతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాయం వరలక్ష్మి, కరపటి శాంతమ్మ, చల్ల మల్లమ్మ, ఈసాల కళావతి, స్వరూప, జ్యోతి పాల్గొన్నారు.