ఖమ్మం, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు మూడో రోజు సమ్మెను తీవ్రతరం చేశారు. రీజియన్ పరిధిలోని ఖమ్మం, మధిర, సత్తుపల్లి, ఇల్లెందు, మణుగూరు, కొత్తగూడెం, భద్రాచలం డిపోల వద్ద శుక్రవారం తెల్లవారుజామునే చేరుకున్న కార్మికులు.. 6 గంటలకు బైఠాయించి, ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. అధికారులు బలవంతంగా బస్సులను నడిపేందుకు యత్నించగా కార్మికులు తీవ్రంగా ప్రతిఘటించి అడ్డుకున్నారు.
కార్మికుల సమ్మెకు పలు పార్టీలు, ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఖమ్మంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సీపీఐ మద్దతు ప్రకటించింది, వారితో కలిసి సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాగం హేమంతరావు, పోటు కళావతి, రామాంజనేయులు, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ కార్యకర్తలు ఆందోళనల్లో పాల్గొన్నారు. ఆర్టీసీ ఖమ్మం రీజియన్ వ్యాప్తంగా మొత్తం 530 బస్సులు నడవాల్సి ఉండగా.. శుక్రవారం 330 బస్సులను నడిపించారు. అత్యధికంగా సత్తుపల్లి డిపో నుంచి 63 బస్సులను నడపగా.. ఇల్లెందు డిపో నుంచి 16 బస్సులను నడిపారు. మూడో రోజు బస్సులు డిపోలకే మరిమితం కావడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఖమ్మం రీజియన్ పరిధిలో శుక్రవారం తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల నియామకం చేపట్టారు. కాగా, డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి నిరసనగా ఖమ్మం నగరంలో శాంతి ర్యాలీ నిర్వహించి, పాత బస్టాండ్ సెంటర్లో మానవహారం చేపట్టారు.

12
ఈ క్రమంలో కార్మికుల పట్ల ట్రాఫిక్ సీఐ బెల్లం సత్యనారాయణ దురుసుగా ప్రవర్తించారు. వారి ఆందోళనపై కించపరిచినట్లు మాట్లాడటంతో కార్మికులు సీఐ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఒక రాష్ట్రంలో ఇలానే ధర్నా చేస్తుంటే ప్రజలు వారిని చెప్పులతో కొట్టారని.. ఇక్కడ ఆ పరిస్థితి తెచ్చుకోకండి అంటూ హేళన చేసినట్లు కార్మికులు ఆరోపించారు.
శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న తమ గురించి ఇలా తప్పుగా మాట్లాడటం సరికాదని అడిగిన కార్మికులను.. ‘ఒకసారి నా స్టేషన్‌కు రా… నా.. సంగతి ఏంటో మీకు తెలుస్తుంది’ అని సీఐ బెదిరింపులకు పాల్పడినట్లు కార్మిక వర్గాలు ఆరోపించాయి. కొత్తగూడెం డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు బీఆర్ఎస్ తరఫున మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు మద్దతు ప్రకటించారు. కార్మికులతో కలిసి సమ్మె శిబిరం వద్ద కూర్చొని మాట్లాడారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సమ్మెకు మద్దతు తెలపడంతోపాటు అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. సత్తుపల్లి డిపో ఎదుట చేపట్టిన మౌన దీక్షలో పాల్గొన్న మహిళా కండక్టర్ జానకి స్పృహతప్పి పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన తోటి ఉద్యోగులు ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యకు నివాళి అర్పిస్తూ.. మధిర పట్టణంలో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన నిర్వహించారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ చిత్రపటం వద్ద అశ్వారావుపేటలో బీఆర్ఎస్ నాయకులు నివాళులర్పించారు. భద్రాచలంలో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. నర్సంపేటలో ఆత్మహత్యకు పాల్పడిన శంకర్ గౌడ్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ఇల్లెందు ఆర్టీసీ డిపో వద్ద సీపీఎం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, మాస్‌లైన్, టీయూసీఐ, పీడీఎస్‌యూ, టీబీజీకేఎస్, ఏఐటీయూసీ, పీవైఎల్ నాయకులు డిమాండ్ చేశారు.