మామిళ్లగూడెం, డిసెంబర్ 10 : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ ఆర్టీసీ) అయ్యప్పస్వాముల కోసం శబరిమల యాత్రకు ప్రత్యేకంగా అద్దె బస్సులను ఏర్పాటు చేసిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ శనివారం ప్రకటనలో కోరారు. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో అయ్యప్పస్వామి భక్తులు మాలధారణతో స్వామివారిని దర్శించుకోవడానికి శబరిమల వెళ్లిరావడం ఆనవాయితీ. భక్తులు ప్రైవేటు బస్సులను ఆశ్రయించి నష్టపోవద్దని, వారికి సురక్షితమైన ప్రయాణాన్ని అందించాలని టీఎస్ ఆర్టీసీ రాయితీతో బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
శబరిమల యాత్రకు డిపాజిట్ లేకుండా 10% రాయితీపై సూపర్‌లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులను అద్దెకు ఇవ్వనున్నట్లు తెలిపారు. అదనపు సీట్ల ద్వారా ఇద్దరు గురుస్వాములు, ఇద్దరు వంట మనుషులు, 12సంవత్సరాలు లోపు మణికంఠస్వాములు, ఒక అటెండర్‌కు ఉచితంగా ప్రయాణం కల్పిస్తున్నామని వివరించారు. బస్సును బుకింగ్ చేసిన గురుస్వామికి ప్రయాణం ఉచితంగా అందిస్తామన్నారు. బస్సులో ఆడియో, వీడియోతోపాటు మొబైల్ చార్జింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.
స్వాములు కోరుకున్న ప్రదేశం నుంచి వారు దర్శించాల్సిన పుణ్యక్షేత్రాల వరకు బస్సులను నడుపనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ డిపోల్లో బస్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. బస్సులో సీట్ రిజర్వేషన్, శబరిమల యాత్రకు బస్సు అద్దె బుకింగ్ కోసం www.tsrtconline.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. అడ్వాన్స్ బుకింగ్‌పై 10% రాయితీ, సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం టీఎస్ ఆర్టీసీ కాల్‌సెంటర్ 040- 23450033, 69440000 నంబర్లో సంప్రదించవచ్చని, పూర్తి వివరాలకు సంబంధిత డిపో మేనేజర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.