కారేపల్లి : ప్రజల కనీస అవసరాలు తీర్చాల్సిన ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆ కాలనీవాసులు సొంత ఖర్చుతో రోడ్డు మరమ్మతులు చేసుకుని శభాష్ అనిపించుకున్నారు. ఖమ్మం ( Khammam ) జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి(కారేపల్లి)మండలం విశ్వనాథపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న కేసీఆర్ కాలనీ( KCR Colony) వెళ్లే రహదారి బురద మయంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డుపై నడవాలంటే ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు విశ్వనాథపల్లి గ్రామపంచాయతీకి రెండు దఫాలుగా 20 ఇండ్ల చొప్పున 40 ఇండ్లు మంజూరు చేసి ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు పంపిణీ చేసింది. ఈ గ్రామం నుంచి సుమారు కిలోమీటర్ దూరంలో ఉన్న కేసీఆర్ కాలనీలో 40 కుటుంబాలు దాదాపు 150 మంది నివాసముంటున్నారు. కాలనీకి వెళ్లాలంటే దారిలో బురద పేరుకుపోయి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
అనేకసార్లు అధికారులకు,స్థానిక ప్రజాప్రతినిధులకు తమ గోడును విన్నవించుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో కాలనీవాసులు డబ్బులు జమ చేసి రోడ్డుపై పేరుకుపోయిన బురదను తొలగించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విశ్వనాథ పల్లి గ్రామం నుంచి కేసీఆర్ కాలనీ వరకు శాశ్వత రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు.