కూసుమంచి, జూలై 14 : పాలేరు రిజర్వాయర్‌లో నీరు అడుగంటి డెడ్ స్టోరేజీకి చేరిన విషయాన్ని శాఖ ఉన్నతాధికారులు, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని, దీనిపై సీఎం వెంటనే స్పందించి సాగర్ నుంచి ఒక టీఎంసీ నీటిని ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారని చీఫ్ ఇంజినీర్ శంకర్‌నాయక్ తెలిపారు. సాగర్ నుంచి పాలేరుకు వస్తున్న జలాలను సీఈ శంకర్‌నాయక్, ఈఈలు మంగలపుడి వెంకటేశ్వరరావు, అనన్య తదితరులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నాయకన్‌గూడెంలో సీఈ విలేకరులతో మాట్లాడుతూ పాలేరు డెడ్ స్టోరేజీ 10.3 అడుగులకు చేరుకోవడంతోపాటు తాగునీటికి ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. దీని గురించి హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ నిర్వహించిన సమీక్షలో పాలేరు రిజర్వాయర్ నుంచి ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలకు మిషన్ భగీరథ నీరు అందించే పరిస్థితిపై తెలియజేశామన్నారు.
శ్రీరాంసాగర్, బయ్యన్న వాగు లేదా సాగర్ నుంచి నీటిని తీసుకోవడం తప్ప ప్రత్యామ్నాయం లేదనే విషయాన్ని పరిశీలించారని, బయ్యన్న వాగు ద్వారా గోదావరి జలాలు రావడం ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున తక్షణమే సాగర్ నీటిని విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. శుక్రవారం సాగర్ డ్యాం నుంచి 4వేల క్యూసెక్కుల నీరు వదిలామన్నారు. పాలేరు రిజర్వాయర్ 136.4 కి.మీ వద్దకు ఇన్‌ఫాల్ ద్వారా 2,600 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుందని తెలిపారు. మూడు జిల్లాల ప్రజలు తాగునీటి అవసరాల కోసం మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు. రిజర్వాయర్ నీటిమట్టం 18 అడుగులు వచ్చే వరకు నింపుతామన్నారు. ప్రస్తుతం వస్తున్న నీటి ఇన్ ఫ్లో శనివారం నాటికి 3వేల క్యూసెక్కుల వరకు పెరిగే అవకాశం ఉందన్నారు. సాగర్ నీరు రావడంతో 24 గంటల్లోనే పాలేరు నీటిమట్టం 2 అడుగులకు పెరిగిందని, శుక్రవారం సాయంత్రానికి 12.5 అడుగులకు చేరుకుందన్నారు.
జిల్లాలో రూ.7.4కోట్లతో కాల్వల పనులు
జిల్లాలోని సాగర్ ఆయకట్టు పరిధిలో 66 పనులను రూ.7.4కోట్లతో చేపట్టామని చీఫ్ ఇంజినీర్ తెలిపారు. సాగర్ నీరు వచ్చే సమయంలో కూడా ప్రధాన కాలువకు నాలుగు చోట్ల పనులు జరుగుతున్నా వాటిని ఆపి పాలేరుకు నీటిని ఇస్తున్నామన్నారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో కాలువలో ప్రవహించే నీటిని ఇతరత్రా మళ్లించకుండా నల్లగొండ సీఈ, సూర్యాపేట ఈఈలకు ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. అంతకుముందు పాలేరు నీటి మట్టం, ఇన్‌ఫ్లోలను పరిశీలించారు. కార్యక్రమంలో ఈఈ మంగలపుడి వెంటేశ్వరరావు, ఖమ్మం ఈఈ అనన్య, డీఈ మధు, జేఈ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.