భద్రాద్రి కొత్తగూడెం, జూలై 20 (నమస్తే తెలంగాణ) : కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. భద్రాచలం వద్ద గోదావరిలో వరద క్రమేపీ పెరుగుతున్నది. కిన్నెరసానిలో భారీగా వరద చేరడంతో 15 వేల క్యూసెక్కుల నీటిని బయటకు వదలిపెట్టారు. చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టు నుంచి 1.45 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మొత్తం గేట్లు ఓపెన్ చేయడంతో దిగువ భాగంలో వరద ఉధృతంగా ప్రవహిస్తున్నది. గుంపల్లి- చర్ల గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. పర్ణశాలలో సీతమ్మ నారచీరెల ప్రదేశం నీట మునిగింది.
భారీ వర్షాల కారణంగా భద్రాచలం డివిజన్ పరిధిలోని దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలంలో గుబ్బలమంగి వాగు పొంగి ప్రవహించడంతో కే లక్ష్మీపురం-పెదనల్లబల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దిగువన ఉన్న గ్రామాలు సంగ్యం, నల్లబల్లి, గౌరారం, పైడిగూడెం, తాటివారిగూడెం, సంజనాపురం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సీతమ్మవాగు పొంగడంతో పర్ణశాల వద్ద దుకాణాలు కూడా నీటమునిగాయి.
ఎగువన కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమేపీ పెరుగుతున్నది. ఉదయం నుంచి గంటకు అడుగు చొప్పున పెరుగుతూ వస్తున్నది. రాత్రి 8 గంటలకు 35.50 అడుగులకు చేరింది. ప్రస్తుతానికి ఎలాంటి ముప్పు లేకపోయినప్పటికీ రాత్రికి మరింత పెరిగే అవకాశం ఉన్నందున అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
జిల్లా అంతటా మోస్తరు వాన కురిసింది. అత్యధికంగా లక్ష్మీదేవిపల్లిలో 37 మిల్లీమీటర్లు, దమ్మపేట మండలం మందలపల్లిలో 12 మిల్లీమీటర్లు, మల్కారం 11 మిల్లీమీటర్లు, ఆళ్లపల్లి, అన్నపురెడ్డిపల్లి, భద్రాచలం, జూలూరుపాడు, పాల్వంచ, బూర్గంపాడు, గుండాల, సుజాతనగర్, చర్ల, దుమ్ముగూడెం, మణుగూరు, అశ్వాపురం మండలాల్లో 10 నుంచి 7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పైన కురిసిన వర్షాలకే ఇక్కడ వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.