మామిళ్లగూడెం, డిసెంబర్ 27: నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి ఆయకట్టులోని చివరి ఎకరా వరకూ సాగునీరు అందిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో చైర్మన్, కలెక్టర్ వీపీ గౌతమ్ అధ్యక్షతన మంగళవారం జరిగిన జిల్లా నీటిపారుదల సలహామండలి సమావేశంలో మంత్రి మాట్లాడారు. మేజర్, మీడియం, మైనర్ లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా సాగునీటికి ఆటంకం కలుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఎకడైనా చిన్న చిన్న లోపాలు ఉంటే తక్షణమే సవరించి నీటి వృథాను అరికట్టాలని సూచించారు. సాగర్ ఆయకట్టుకు గత సంవత్సరం, ఈ సంవత్సరం నీరు పుషలంగా వచ్చిందని, ఇప్పటికీ నాగార్జున సాగర్‌లో సాగునీరు సమృద్ధిగా ఉందని, యాసంగికి మొదటి విడత నీరు విడుదలవుతూనే ఉందని వివరించారు. కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ సాగర్ ఎడమ కాలువ ద్వారా యాసంగికి నీటి లభ్యత సమృద్ధిగా ఉందని, మంత్రి సూచనలతో ఎప్పటిప్పుడు ఇరిగేషన్ అధికారులతో సమీక్షిస్తున్నామని అన్నారు.
మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్ల మాట్లాడుతూ సాగర్ కెనాల్ ద్వారా సాగునీరు సమృద్ధిగా వస్తేనే జిల్లా సస్యశ్యామలమవుతుందని అన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ చివరి ఆయకట్టు వరకు నీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు మాట్లాడుతూ గతంలో వైరా చెరువుకు నీరు రావాలంటే చాలా ఇబ్బందులు ఉండేవని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వమే చెరువును నింపుతోందని అన్నారు. వైరా ఎమ్మెల్యే రాములునాయక్, ఎమ్మెల్సీ తాతా మధు, అదనపు కలెక్టర్ మధుసూదన్, ట్రైనీ కలెక్టర్ రాధికాగుప్తా, ఇరిగేషన్ సీఈ శంకర్‌నాయక్, ఆర్డీవోలు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, డీఏవో విజయనిర్మల, డీహెచ్‌వో అనసూర్య, రైతుబందు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల్ల వెంకటేశ్వరరావు, ఇరిగేషన్ అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.