ఖమ్మం, ఏప్రిల్ 16: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి, కొత్త ఆర్ఓఆర్ చట్టంపై అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో కలిసి రెవెన్యూ శాఖ అధికారులతో భూభారతి, కొత్త ఆర్ఓఆర్ చట్టంపై బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూమి హకుల భద్రత, భూ సమస్యల సత్వర పరిషారానికి ప్రభుత్వం భూభారతి, కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని అమల్లోకి తెచ్చిందన్నారు. దీనిపై తహసీల్దార్లు అవగాహన పెంచుకోవడంతోపాటు మండల, గ్రామస్థాయి అధికారులకు అవగాహన కల్పించాలన్నారు.
చట్టం అమలుకు పైలట్ ప్రాజెక్ట్ క్రింద నేలకొండపల్లి మండలాన్ని ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. ఈ నెల 17 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించి దీనిపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. సదస్సులకు కనీసం 500లకు పైగా జన సమీకరణ చేయాలని, ఫంక్షన్ హాల్, తాగునీరు, పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలన్నారు. సందేహాల నమోదుకు రిజిస్టర్ నిర్వహించాలన్నారు. అలాగే వాతావరణ పరిస్థితులను గమనిస్తూ ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తకుండా తహసీల్దార్లు చర్యలు చేపట్టాలన్నారు.
మొకజొన్న కొనుగోళ్లలో సమస్యలుంటే మార్ఫెడ్ అధికారులతో సమన్వయం చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కొత్త చట్టం, కొత్త నిబంధనలపై అధికారులు పూర్తి అవగాహన పొందాలన్నారు. 2020లో ఉన్న రికార్డుల తప్పొప్పులను సరిచేయడానికి ఫిర్యాదుదారు ఏడాదిలోపు దరఖాస్తు చేయాలని, ఈ దిశగా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం రెవెన్యూ అధికారులకు చట్టంపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. సమావేశంలో డీఆర్వో ఏ.పద్మశ్రీ, ఎస్డీసీ ఎం.రాజేశ్వరి, ఆర్డీవోలు నర్సింహారావు, రాజేంద్ర గౌడ్, కలెక్టరేట్ ఏవో అరుణ, తహశీల్దార్లు, కలెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.