ఖమ్మం వ్యవసాయం, అక్టోబర్ 22 : క్షేత్రస్థాయిలో నిత్యం కర్షకులకు చేదోడు వాదోడుగా ఉండాలనే ఉద్దేశంతో గత కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయ విస్తరణాధికారుల(ఏఈవో)ను నియమిస్తే.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పనులతోపాటు బోలెడంత భారాన్ని మోపుతోంది ప్రస్తుత రేవంత్‌రెడ్డి సర్కారు. ‘ఇంతటి పనిభారం మోయలేం మహాప్రభో..’ అంటూ ఏఈవోలు మొరపెట్టుకున్నా సర్కారుకు చీమ కుట్టినట్టు కూడా లేదు. అత్యంత కష్టతరమైన ఈ సర్వేను తాము చేయలేమంటూ ఏఈవోలు నిరసన వ్యక్తం చేసినందుకు ఆగ్రహించిన కాంగ్రెస్ సర్కారు.. ఏకంగా వారిపై కక్షగట్టింది. ‘ఉద్యోగం చేస్తారా? ఇంటికి వెళ్తారా?’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నది. దీంతో హడలిపోయిన ఏఈవోలు.. తరువాత విధుల్లోకి వెళ్తున్నా వారి హాజరును నమోదు చేయడం లేదు. ఉన్నతాధికారులతో చెప్పి వారికి సిక్ లీవ్ (సీఎల్) వేయిస్తోంది. దీంతో మరో వారంలో అందాల్సిన వేతనాలు అందుతాయో.. లేదోనన్న.. ఆందోళన విస్తరణాధిరులను వేధిస్తోంది. ‘కేంద్ర ప్రభుత్వ డిజిటల్ క్రాప్ సర్వే చేయలేం’ అన్న పాపానికి ఏకంగా మెమోలు జారీ చేస్తూ ముచ్చెమటలు పట్టిస్తోంది.
పంటల సాగులోనూ, ప్రభుత్వ పథకాల చేరవేతలోనూ క్షేత్రస్థాయిలో కర్షకుల వెన్నంటి ఉండేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం ఏఈవోలను నియమించింది. ఐదు వేల ఎకరాలకు ఓ క్లస్టర్‌ను ఏర్పాటు చేసి దాని పర్యవేక్షణ బాధ్యతను ఏఈవోలకు అప్పగించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల కోసం క్లస్టర్‌కు ఒకటి చొప్పున రైతు వేదికను నిర్మించింది. ఖమ్మం జిల్లాలో మొత్తం 130 క్లస్టర్లను ఏర్పాటు చేయడంతో దాని యూనిట్‌గా ఏఈవోలు నిత్యం అన్నదాతలకు సేవలందిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 130 క్లస్టర్లలో 130 మంది ఏఈవోలు పనిచేస్తున్నారు. వీరిలో 108 మంది రెగ్యులర్ ఏఈవోలు కాగా.. 16 మంది ఒప్పంద ఏఈవోలు. మరో ఐదుగురు ఆత్మ ప్రాజెక్టు నుంచి వచ్చిన విస్తరణాధికారులు.
నిత్యం క్షేత్రంలో కర్షకులతో మమేకమవుతూ పనిచేస్తుంటారు ఏఈవోలు. వానకాలం ప్రారంభం నుంచి మొదలుకొని.. యాసంగి ముగిసే వరకూ అన్నదాతలకు అన్ని సహాయక సహకారాలు అందిస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా, పంటల నమోదు, ఎరువుల పంపిణీ, విత్తనాల సరఫరా, పంటల కొనుగోళ్లు వంటి పనులను క్షేత్రస్థాయిలో చేస్తుంటారు. సదస్సులు, కాన్ఫరెన్సుల్లో ప్రభుత్వం సూచించిన అంశాలపై అన్నదాతలకు అవగాహన కల్పిస్తుంటారు. ఇన్ని పనులతో ఇప్పటికే తలకుమించిన భారం పడుతున్న సమయంలో ఇటీవల కేంద్రం చేపట్టిన డిజిటల్ క్రాప్ సర్వేను కూడా వీరే చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రైతుల పొలాల వద్దకు వెళ్లి పంటలను ప్రత్యక్షంగా ఫొటో తీసి కేంద్ర ప్రభుత్వ యాప్‌లో నమోదు చేయాలి. సర్వే నంబర్ల ఆధారంగా కుంట కుంటగా ఉండే పంటల వద్దకు వెళ్లి సర్వే చేయాల్సి రావడం ఎంతో కష్టతరమైన పని. తమ మాతృశాఖ పనులతోనే భారం పడుతున్నందున ఈ కష్టతరమైన సర్వే వల్ల వారికి మరింత భారం పడుతోంది. ఇంతటి భారాన్ని తాము మోయలేమంటూ ఏఈవోలు ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నారు. లేదంటే తమకు సహాయకులనైనా ఇవ్వాలని, లేదంటే ఇతర రాష్ర్టాల మాదిరిగా ఈ సర్వేను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలని కోరుతున్నారు. కానీ ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అంటోంది.
ఏటా డిజిటల్ క్రాప్ సర్వే చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిరుడు నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలుత ఖమ్మం అర్బన్ మండలం ధంసలాపురం, మల్లెమడుగు క్లస్టర్లలో ఏఈవోలు ప్రయోగాత్మకంగా డిజిటల్ క్రాప్ సర్వే చేశారు. ఆ రెండు క్లస్టర్ల సర్వే పూర్తయ్యేందుకే మొత్తం ముగ్గురు ఏఈవోలకు దాదాపు 93 రోజుల సమయం పట్టింది. అందుకని ఇంతటి పని ఒత్తిడిలో ఇలాంటి కష్టమైన సర్వే చేయడం తమకు మోయలేని భారమవుతుందని ఏఈవోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయాల్సిందేనంటూ ప్రభుత్వం హుకుం జారీ చేస్తోంది.
కేంద్ర సర్వే చేయలేమన్న ఏఈవోలపై ఉన్నతాధికారులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఈ నెల 10న సదరు ఏఈవోలకు మెమోలిచ్చారు. కొద్ది రోజులకే 21 మందికి మరోమారు నోటీసులు జారీ చేశారు. సర్వే యాప్ డౌన్లోడ్ చేసుకోని పక్షంలో ఒకటి రెండు రోజుల్లో విధుల్లోంచి తొలగిస్తామంటూ మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలో మంగళవారం ఏకంగా ఇతర కారణాలను చూపి పలు జిల్లాల్లో పలువురు ఏఈవోలను సస్పెండ్ చేశారు. దీంతో జిల్లాలోని ఏఈవోలు ఆందోళనలో పడ్డారు.
డిజిటల్ క్రాప్ సర్వే ప్రక్రియ మన రాష్ర్టానికే పరిమితం కాదు. దేశంలోని అన్ని రాష్ర్టాల పక్రియ. కేంద్రం ప్రత్యేకంగా నిధులివ్వడంతో ఆయా రాష్ర్టాలు ఈ ప్రాజెక్టును ప్రైవేట్ సంస్థలకు అప్పగించాయి. తెలంగాణలో మాత్రమే ఏఈవోలు చేయాలంటున్నారు. తాత్కాలికంగా ఓ సహాయకుడిని నియమించినా సర్వే పూర్తి చేస్తాం. కానీ.. ప్రభుత్వం అంగీకరించడం లేదు. ఏఈవోలకు మరింత ఒత్తిడి పెరుగుతోంది.