మామిళ్లగూడెం, జూన్ 6 : రాష్ట్రంలో కమీషన్ల పాలన నడుస్తోందని, కమీషన్లు వచ్చే పథకాలకే నిధులు కేటాయిస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగు రాకేశ్రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అబద్ధ్దాలకు బ్రాండ్ అంబాసిడర్గా మారాడని ఆరోపించారు. ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజల కాళ్లు మొక్కి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.
ఆరు గ్యారెంటీలు, డిక్లరేషన్ల పేరుతో ఆ పార్టీ అధినాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో ప్రకటించి.. వాటిని అమలు చేయడంలో చిత్తశుద్ధి చూపడం లేదన్నారు. అధికారం చేపట్టిన తర్వాత 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, ఆ ఉద్యోగ ప్రకటనలు, పరీక్షలన్నీ కేసీఆర్ ప్రభుత్వం చేసినవనే సంగతి మర్చిపోతున్నారని, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఊసే లేకుండా పోయిందన్నారు. రాజీవ్ యువ వికాసం పేరుతో యువతను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతామని, వారికి వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు చేస్తామని ఆశలు రేకెత్తించి ఆ పథకాన్ని వాయిదా వేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలను మూసివేసి.. యంగ్ ఇండియా పేరుతో పాఠశాలలు స్థాపిస్తున్నామని చెబుతున్నారని, అయితే ఈ ఏడాది ప్రవేశాలకు అవకాశం లేకుండా పేద విద్యార్థులను చదువులకు దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఎరువులతోపాటు రైతు భరోసా వంటి పథకాలు అమలు చేసే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. ఎరువులు, విత్తనాల కోసం రైతులు క్యూలో నిలబడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.
క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగులకు పీఆర్సీ ప్రస్తావనే లేదన్నారు. ఆరు డీఏలలో ఇప్పుడు రెండు ఇస్తున్నామని, వాటిలో ఒక వెంటనే అమలు చేస్తున్నామని, మరొకటి ఆరు నెలల తర్వాత చెల్లిస్తామని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజా పాలన పాడెక్కిందన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు, ఉద్యమ కారులు బిచ్చాల తిరుమలరావు, బొమ్మెర రామ్మూర్తి, ఉప్పల వెంకటరమణ, శేషగిరి, నాయకులు బంక మల్లయ్య, బలుసు రామకృష్ణ, ఉమాశంకర్, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.