వైరాటౌన్, జనవరి 23: బొగ్గు కుంభకోణం నుంచి తప్పించుకునేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నదని, బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ సిట్ పేరుతో మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లను ప్రశ్నిస్తూ తప్పుదారి పట్టిస్తున్నదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి తన స్థాయిని మరిచి తిట్ల దండకంతో మాట్లాడుతూ శునకానందం పొందుతున్నారని మండిపడ్డారు.
రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో వైరాలో బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు, మద్దెల రవి అధ్యక్షతన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఆరు గ్యారెంటీలను అమలు చేయలేదని విమర్శించారు. ఏడాది నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడం పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల ముందు మహిళలకు రూ.2,500 చొప్పున ఇస్తామని చెప్పి ప్రభుత్వం దానిని విస్మరించిందని, ఒక్క కుటుంబానికైనా కల్యాణలక్ష్మి పథకం కింద బంగారం పంపిణీ చేశారా? అని ప్రశ్నించారు.
ప్రజా పాలన అంటూ రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలను నిర్వీర్యం చేశారని, శాటిలైట్ ద్వారా సర్వే చేసి రైతు భరోసా అందిస్తామని జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సెంట్రల్ లైటింగ్, ట్యాంక్ బండ్, ఇండోర్ స్టేడియం, రూ.20 కోట్ల మున్సిపల్ నిధులతో రహదారులు, డ్రైనేజీలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో గ్యారెంటీ కార్డులను అమలు చేస్తామని చెప్పి ప్రజలకు బాకీ పడిన కార్డులను ఈ నెల 27 నుంచి ఇంటింటికీ పంపిణీ చేయాలని కోరారు.
వైరా మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగురవేసేందుకు ప్రతి కార్యకర్తా సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బానోతు చంద్రావతి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్జేసీ కృష్ణ, నాయకులు పగడాల నాగరాజు, బచ్చు విజయ్‌కుమార్, లకావత్ గిరిబాబు, బానోతు మంజుల మదన్‌లాల్, ఎల్లంకి సత్యనారాయణ, కట్టా కృష్ణార్జున్‌రావు, వనమా విశ్వేశ్వరరావు, లాల్ మహ్మద్, పోట్ల శ్రీను, దొంతబోయిన వెంకటేశ్వర్లు, మాదినేని సునీత, దారెల్లి పవిత్రకుమార్, మానవ సక్కుబాయి, మిట్టపల్లి కిరణ్, బట్టా భద్రయ్య, కొత్తా వెంకటేశ్వరరావు, దామా వీర య్య, ధనేకుల వేణు తదితరులు పాల్గొన్నారు.