భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 5 (నమస్తే తెలంగాణ) : ఉద్యమ సారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వ్యక్తిగత కక్ష పెంచుకున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. తెలంగాణను కేసీఆర్‌ను, ఆయన పేరును శాశ్వతంగా దూరం చేస్తానంటూ అనేక సభల్లో విద్వేష ప్రసంగాలు చేశారు. ఆ ప్రసంగాల్లో చెప్పినట్లుగానే కేసీఆర్ జనరంజక పాలనలో ఆయనకు పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన అన్ని పథకాలపైనా ఉక్కుపాదం మోపుతున్నారు. చివరికి, పల్లె ప్రకృతి వనాలపైనా, అందులో పెరుగుతున్న మొక్కలపైనా తన అక్కసును వెళ్లగక్కుతున్నారు. ఇందులో భాగంగానే తాను ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రెండుళ్లుగా ఏ ఒక్కరోజు కూడా పల్లె ప్రకృతి వనాలవైపు కన్నెత్తి కూడా చూడలేదు.
దీంతో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లు పచ్చందాలను పంచిన పల్లె ప్రకృతి వనాలు నేటి రేవంత్‌రెడ్డి పాలనలో చిట్టడవులను తలపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధిలోపం, పర్యవేక్షణ వైఫల్యం కారణంగా కళావిహీనమైన ఈ పచ్చని వనాలు.. ఈ రెండేళ్లలో తమ రూపాన్ని పూర్తిగా కోల్పోయాయి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఉదయం, సాయంత్రం వేళల్లో పల్లె ప్రజలకు ఆహ్లాదాన్ని పంచిన ఈ వనాలు.. ఇప్పటి కాంగ్రెస్ సర్కారు ఏలుబడిలో మొత్తం ఎండిపోయాయి. చెత్తాచెదారంతో నిండిపోయాయి.
పల్లెలే దేశానికి పట్టుగొమ్మలన్న మహాత్ముడి స్ఫూర్తితో, పల్లెలు నిత్యం పచ్చగా ఉండాలన్న సంకల్పంతో ‘పల్లె ప్రకృతి వనాల’కు శ్రీకారం చుట్టారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలోనే మొక్కల పెంపకం ప్రాధాన్యాన్ని, వనాల పెంపుదల ఆవశ్యకతను రాష్ట్ర ప్రజలకు తెలియజేశారు. ఇందుకోసం ఏటా ఇంటింటికీ ఆరు చొప్పున మొక్కలు పంపిణీ చేశారు. ప్రతి గ్రామంలోనూ ఒక పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఒకవైపు పర్యవరణాన్ని పరిరక్షిస్తూనే, మరోవైపు పల్లె వాసులకు ఆహ్లాదాన్ని పంచారు. ఈ ముందడుగుతో నాడు కళకళలాడిన పల్లెలు.. నేడు కళావిహీనమయ్యాయి. నిలువునా ఎండిపోయి కారడవులను తలపిస్తున్నాయి.
భద్రాద్రి జిల్లాలో 471 పంచాయతీల్లో 1,280 పల్లె పకృతి వనాలను అప్పటి బీఆర్ఎస్ సర్కారు ఏర్పాటు చేసింది. ఒక్కో వనానికి అరెకరం స్థలం కేటాయించి పార్కులను తీర్చిదిద్దింది. ప్రతీ వనంలోనూ అనేక రకాల పచ్చని మొక్కలను పెంచి పల్లెలకు పచ్చందాలను తీసుకొచ్చింది. పల్లె ప్రజలందరూ ఈ ప్రకృతి వనాలకు, పార్కులకు ఉదయం, సాయంత్రం వేళల్లో వచ్చి గడిపేవారు. ఈ వనాలు అందించే ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించేవారు. కానీ, కేసీఆర్‌పై కోపంతో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ప్రకృతి వనాల్లో మొక్కలపై అక్కసు పెంచుకోవడంతో ఆ ప్రకృతి వనాలన్నీ నేడు ఆలనాపాలనకు దూరమయ్యాయి. స్వచ్ఛమైన గాలులను, పచ్చందాలను అందించే మొక్కలకు కనీసం నీళ్లు కూడా పట్టలేదు. దీంతో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి పెంచిన మొక్కలను చుట్టుముట్టాయి. అన్నీ కలిసి అడవులను తలపిస్తున్నాయి. దీంతో, ఇటీవల బాధ్యతలు చేపట్టిన పంచాయతీల కొత్త పాలక వర్గాలపైనే గ్రామాల ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. పల్లెల్లో ఆనవాళ్లు కోల్పోయిన ప్రకృతి వనాలను పునరుద్ధరించి ఆహ్లాదాన్ని పంచాలన్న ఆశతో ఎదురుచూస్తున్నారు.
గత కేసీఆర్ ప్రభుత్వం వేసిన మొక్కలన్న కారణంతోనే ప్రస్తుత ప్రభుత్వం ఈ పల్లె ప్రకృతి వనాలను, అందులోని మొక్కలను పట్టించుకోలేదు. రెండేళ్లుగా కనీస పర్యవేక్షణ చేయకపోవడం దారుణం. వ్యక్తుల మీద ఉన్న కక్షను మొక్కల మీద తీర్చుకుంటున్నట్లుగా ఉంది. పకృతి ఉంటేనే కదా మానవ మనుగడ ఉంటుంది. ప్రభుత్వాలకు, పార్టీలకతీతంగా మొక్కలు నాటాలి. వాటిని బతికించుకోవాలి.
-బోడా బాలూనాయక్, సర్పంచ్, టేకులపల్లి
పల్లె పకృతి వనాలను ప్రస్తుత ప్రభుత్వం రెండేళ్లుగా పట్టించుకోలేదు. కనీసం చెట్ల మధ్యలో పిచ్చి మొక్కలు పెరిగినా కూడా వాటిని తొలగించలేదు. ఎండిపోయిన, చనిపోయిన చెట్లు, మొక్కల స్థానంలో కొత్త మొక్కలు కూడా వేయలేదు. మొక్కలకు నీళ్లు పట్టాల్సిన విషయాన్ని అసలుకే మర్చిపోయారు. పంచాయతీల్లో ట్రాక్టర్లను, ట్యాంకర్లను గత కేసీఆర్ ప్రభుత్వం కొనుగోలు చేసినా.. ఇప్పటి ప్రభుత్వం కనీసం వాటితో మొక్కలకు నీళ్లు కూడా పోయలేదు.
-కారం శివ, సర్పంచ్, పెంట్లం గ్రామం, అన్నపురెడ్డిపల్లి మండలం
పల్లె ప్రకృతి వనాలను కాపాడుకోవాలి. చెట్లు, మొక్కలు ఎండిపోతే వాటి స్థానంలో కొత్తవి నాటాలి. మొక్కల మధ్య పిచ్చి గడ్డి పెరిగితే వెంటనే శుభ్రం చేయాలి. పల్లె ప్రకృతి వనాల పరిరక్షణ బాధ్యత పంచాయతీలదే. పల్లె పార్కుల నిర్వహణ గురించి ప్రజలకు, పంచాయతీల సిబ్బందికి చెబుతూనే ఉన్నాం. కొన్ని పల్లె ప్రకృతి వనాలకు ఫెన్సింగ్ పోయింది. అక్కడ సరిచేస్తాం. మొక్కలను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంటుంది.
-దిలీప్‌కుమార్, ఇన్చార్జి డీపీవో, భద్రాద్రి కొత్తగూడెం