ఖమ్మం, డిసెంబర్ 19: సర్వమత సమానత్వానికి, సంస్కృతీ సంప్రదాయాలకు ఆలవాలమైన తెలంగాణలో పండుగల వేళ నిరుపేదలూ సంతోషంగా ఉండాలని, ఉన్నత వర్గాల ప్రజలతోపాటు పేదలు కూడా పండుగను సంతోషంగా జరుపుకోవాలని గత కేసీఆర్ ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు అనుగుణంగానే అన్ని పండుగలకూ ఆయా మతాల ప్రజలకు కానుకలు అందిస్తూ వచ్చింది. తెలంగాణ సాంస్కృతిక వేడుకైన బతుకమ్మ పండుగకు 18 ఏళ్లు నిండిన అన్ని మతాల మహిళలకూ బతుకమ్మ చీరలనూ అందిస్తూ వచ్చింది. భిన్నరకాల డిజైన్లతో తెలంగాణ చేనేత కార్మికులు తయారు చేసిన బతుకమ్మ చీరలను ప్రభుత్వం పంపిణీ చేసేది.
ఈ చీరలకు రాష్ట్ర ఆడబిడ్డల నుంచి అపూర్వ ఆదరణ లభించేది. వాటిని అందుకున్న ఆడబిడ్డలు ఎంతగానో మురిసిపోయేవారు. వాటిని అందుకునేందుకు ఎంతో ఓపికగా బారులుతీరేవారు. ప్రభుత్వం పంపిన బతుకమ్మ చీరలు ధరించి తెలంగాణ సంస్కృతికి రూపమైన బతుకమ్మల వద్ద ఆడిపాడేవారు. అంతే సంతోషంగా తొమ్మిదో రోజున సాగనంపేవారు. అంతటి ఆదరణ పొందిన బతుకమ్మ చీరలకు ఏడాది క్రితం వచ్చిన కాంగ్రెస్ సర్కారు మంగళం పాడింది. దీంతో ఈ ఏడాది బతుకమ్మ ఉత్సవాల్లో ఆడబిడ్డలందరూ అసంతృప్తిగానే పాల్గొన్నారు. తెలంగాణ జీవనాడి అయిన బతుకమ్మకు ఆదరణ తగ్గించడాన్ని, ఇటీవల తెలంగాణ తల్లి నూతన విగ్రహం చేతిలో బతుకమ్మను తొలగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సమైక్య పాలనను గుర్తుకు తెస్తున్నారంటూ రేవంత్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు.
సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన బతుకమ్మకు తెలంగాణను తెచ్చిన కేసీఆర్ పూర్వ వైభవం కల్పించారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను రాష్ట్ర ప్రజలందరూ గౌరవించుకునేలా వేడుకలు నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు తెలంగాణ ఆడబిడ్డలందరూ సంతోషంగా బతుకమ్మలు ఆడేలా ఏర్పాట్లు చేసి వసతులు కల్పించేవారు. మధ్యాహ్నం తరువాత వెళ్లి బతుకమ్మ ఆడుకునేందుకు వీలుగా మహిళా ఉద్యోగులకు వెసులుబాటు కల్పించేవారు. కుల, మత తారతమ్యాలు లేకుండా 18 ఏళ్లు నిండి రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఆడబిడ్డకూ పండుగకు పది, పదిహేను రోజుల ముందుగానే బతుకమ్మ చీరలు పంపిణీ చేసేవారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత మొదలైన ఈ బతుకమ్మ చీరల పంపిణీ నిరుటి వరకూ నిరాటంకంగా కొనసాగింది. రకరకాల రంగులు, నాణ్యమైన చీరలు అందుకున్న ఆడబిడ్డలు వాటిని ధరించి సంతోషంగా బతుకమ్మలు ఆడేవారు. ఖమ్మం జిల్లాలో దాదాపు 3 లక్షలకు పైగా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తూ వచ్చింది గత కేసీఆర్ ప్రభుత్వం. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో రేషన్ డీలర్ల ద్వారా వీటిని పంపిణీ చేసేది. కానీ.. ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం ఈ ఏడాది బతుకమ్మ చీరల పంపిణీని నిలిపివేసింది. అధికారికంగా నిర్వహించాల్సిన బతుకమ్మ వేడుకలకు మంగళం పాడింది. వైభవాలను పక్కనబెట్టి తూతూమంత్రంగా మమ అనిపించింది.
ముస్లింల అత్యంత పవిత్రమైన రంజాన్ పండుగకు గత కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యమిచ్చింది. రంజాన్ మాసం కొనసాగినన్నాళ్లూ అధికారికంగా ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసేది. రంజాన్ తోఫాలకైతే అపూర్వ ఆదరణ లభించేది. ఆ రంజాన్ తోఫాల కిట్‌లో సేమ్యాలతోపాటు ఇంటి పెద్దలకు లాల్చీపైజామా చీర, జాకెట్; పిల్లలకు పంజాబీ డ్రెస్ మెటీరియల్, ప్యాంటు షర్టు వంటివి ఉచితంగా పంపిణీ చేసేది. వాటిని అందుకున్న నిరుపేద ముస్లిం కుటుంబాలు ఎంతగానో మురిసిపోయేవి. పండుగను ఎంతో సంతోషంగా జరుపుకునేవి. ఖమ్మం నియోజకవర్గానికి 2,500, పాలేరు, సత్తుపల్లి, మధిర, వైరా నియోజకవర్గాలకు 1,500 చొప్పున ఖమ్మం జిల్లావ్యాప్తంగా 8,500 రంజాన్ తోఫాలను ప్రభుత్వం పంపేది. కానీ.. ఏడాది క్రితం తెలంగాణలో పాలనా పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రంజాన్ తోఫాలను పూర్తిగా నిలిపివేసింది.
‘తెలంగాణలో పండుగల వేళ ఏ ఒక్కరూ పస్తులుండే పరిస్థితి ఉండకూడదు. ఆ రోజున ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేదనే కారణంతో పండుగకు కొత్త బట్టలు లేవన్న బాధ ఉండకూడదు. కుల, మత ఆచారాలకు అతీతంగా ఆయా పండుగలకు ప్రభుత్వమే కొత్త దుస్తులు అందిస్తుంది. దసరా వేళ ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు, రంజాన్ కోసం ముస్లింలకు రంజాన్ తోఫాలు, క్రిస్మస్కు క్రైస్తవుల కోసం క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్‌లు అందిస్తాం. మత సామరస్యాన్ని చాటుతాం. నిరుపేదలు కూడా పండుగను సంతోషంగా జరుపుకోవాలన్నదే మా ప్రభుత్వ సంకల్పం.’
-గతంలో పలు ప్రభుత్వ కానుకల పంపిణీ సభల్లో కేసీఆర్
రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక బతుకమ్మ చీరలను, రంజాన్ తోఫాలను నిలిపివేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఐదు రోజుల్లో రాబోయే క్రిస్మస్ కానుకలకూ మంగళం పాడింది. క్రైస్తవులకు ఎంతో ప్రీతిపాత్రమైన క్రిస్మస్ పండుగకు రెండు వారాల ముందుగానే గత కేసీఆర్ ప్రభుత్వం నిరుపేద క్రైస్తవులకు క్రిస్మస్ కానుకల కిట్లను పంపిణీ చేసేది. నియోజకవర్గానికి వెయ్యి చొప్పున ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఐదు వేల కానుకలను అందించేది. ఈ గిఫ్ట్ ప్యాక్‌లో ఒక చీర, పంజాబీ డ్రెస్, ప్యాంట్, షర్టు ఉండేవి. కుటుంబంలోని తల్లిదండ్రులకు, కుమార్తెకు దుస్తులు అందించేది. కానీ.. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటివరకు క్రిస్మస్ కానుకల పంపిణీపై అధికారులకు కూడా ఎలాంటి సమాచారమూ లేదు. దీంతో వీటిని నిలిసివేసినట్లు స్పష్టమవుతోంది.