పెనుబల్లి, ఏప్రిల్ 15: రాష్ట్రంలోని రేవంత్ సర్కారు.. రైతుల పాలిట శాపంగా మారిందని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోగా.. రైతులకూ గుదిబండలా దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతలు ఆరుగాలం శ్రమించి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెస్తే.. అక్కడ ప్రభుత్వం సరైన సౌకర్యాలు ఏర్పాటుచేకపోవడంతో ఆ ధాన్యమంతా వర్షపు నీటిపాటైందని ఆందోళన వ్యక్తం చేశారు.
పంటను అమ్ముకునే సమయంలో అన్నదాతలు అల్లకల్లోలమయ్యారని ఆవేదనచెందారు. ఇంత జరిగినా కొనుగోలు కేంద్రాల వైపు, అక్కడి కర్షకుల పైపు కాంగ్రెస్ ప్రభుత్వం కన్నెత్తి కూడా చూడలేదని దుయ్యబట్టారు. అకాల వర్షం కారణంగా ధాన్యం నీటిపాలైన కల్లూరు మండలం పుల్లయ్యబంజరలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, అక్కడ తడిసి ముద్దయిన ధాన్యాన్ని సండ్ర వెంకటవీరయ్య మంగళవారం పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడారు. వారి సమస్యలు విన్న అనంతరం అక్కడే ధర్నాకు దిగారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతులకు అందుబాటులో ఉండాలని డిమాండ్ చేశారు. 20 రోజులుగా ఆలస్యంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయడం వల్ల కొనుగోలు కేంద్రంలోనే లక్ష బస్తాలు నిలిచిపోయాయని అన్నారు. కేంద్రాలను త్వరగా ఏర్పాటుచేసి వెంటనే కొనుగోళ్లు చేపట్టి.. తక్షణమే మిల్లులకు ఎగుమతి చేసి ఉంటే కల్లాల్లోని ధాన్యం తడిసేది కాదని అన్నారు.
కోసిన ధాన్యం పొలాల్లో కొట్టుకుపోయేది కూడా కాదని అన్నారు. ఒక్క పుల్లయ్యబంజరలోనే లక్ష బస్తాలు నిల్వ ఉన్నప్పటికీ కనీసం ప్రభుత్వం ఈ కొనుగోలు కేంద్రం వైపు కన్నెత్తి కూడాచూడకపోవడం ఏమిటని ప్రశ్నించారు. అనంతరం రైతులు మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదని, కనీసం కల్లాల వైపు వచ్చిన పాలకులు లేరని ఆవేదన వ్యక్తం చేశారు.
‘మీరు ఉన్నప్పుడు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వెంటనే జిల్లా యంత్రాంగాన్ని రప్పించి సమస్యను పరిష్కరించేవారు’ అంటూ సండ్ర వద్ద రైతులు ఆవేదన చెందారు. బీఆర్ఎస్ నాయకులు పాలెపు రామారావు, కూసంపూడి మహేశ్, బోగోలు లక్ష్మణరావు, కట్టా అజయ్‌కుమార్, రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, దుగ్గిదేవర వెంకట్‌లాల్, పెద్దబోయిన మల్లేశ్వరరావు, కాటంనేని వెంకటేశ్వరరావు, రాజశేఖర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, పెడకంటి రామకృష్ణ, షేక్ కమ్లీ, కొరకొప్పు ప్రసాద్, సీహెచ్.కిరణ్‌కుమార్, అజ్మీరా జమలయ్య, ఖమ్మంపాటి రమేశ్, నారాయణరావు, గంగవరపు శ్రీనివాసరావు, కల్యాణపు కొండలరావు, నందిగాం ప్రసాద్, రాఘవులు, బానోతు కృష్ణ, నేపాల్ కృష్ణ, షరాబు, వెంకటేశ్వరరావు, వీరకృష్ణ, నాగయ్య, వీరయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.