ఖమ్మం రూరల్, మార్చి 25 : ప్రశ్నించే వారిని చూస్తే సీఎం రేవంత్‌రెడ్డికి భయం అని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి పెరుమాళ్లపల్లి మోహన్‌రావు అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో నిరసన ర్యాలీ చేస్తున్న ఆశా వర్కర్లను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం ఖమ్మం రూరల్ మండలంలో ఆశా వర్కర్ల యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో జలగంనగర్ జాతీయ రహదారి నుండి మండల పరిషత్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఆశాలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడగటానికి వెళ్లిన ఆశా వర్కర్లను అరెస్టులు చేయాడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించే వారిని చూస్తే భయపడుతున్నారని, పోలీసులతో అరెస్టులు చేయిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆశా యూనియన్ నాయకులతో చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల యూనియన్ సీఐటీయూ మండల అధ్యక్ష, కార్యదర్శులు మల్లీశ్వరీ, జ్యోతి, సబ్ సెంటర్ల బాధ్యులు సుభద్ర, నాగమణి, పుష్ప, రూపిణీ, ఉమ, లలిత, నీలిమ, అరుణ, సుజాత, పుల్లమ్మ పాల్గొన్నారు.
గ్రామ పంచాయతీ వర్కర్స్ ని అక్రమంగా అరెస్టు చేయడాన్ని, అలాగే గ్రామ దీపికలను, వీఓఏలను తెల్లవారుజామున అరెస్టు చేయడాన్ని పెరుమాళ్లపల్లి మోహన్‌రావు తీవ్రంగా ఖండించారు. ఖమ్మం రూరల్ పోలీసు స్టేషన్లో అరెస్టు అయిన పంచాయతీ వర్కర్స్, ఐకేపీ వీఓఏలను ఆయన పరామర్శించారు. అనంతరం వారిని స్టేషన్ నుండి విడిపించుకుని వెళ్లారు. అరెస్టైయిన వారిలో పంచాయతీ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా నాయకుడు జిల్లపల్లి రాములు, వెంకన్న, అనురాధ, గోపయ్య, రామకృష్ణ, చరణ్, ధనమూర్తి, ఐకేపీ వీఓఏ మండల కార్యదర్శి జి. వెంకట్రావమ్మ ఉన్నారు.
CITU : ప్రశ్నించే వారిని చూస్తే రేవంత్‌కు భయం : పెరుమాళ్లపల్లి మోహన్‌రావు