సత్తుపల్లి, నవంబర్ 16: ప్రభుత్వ ఉద్యోగి సగటున ముప్పై ఏళ్ల పాటు విధులు నిర్వహిస్తారు. పదవీ విరమణ చేసిన తర్వాత శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కోరుకుంటారు. ఉద్యోగం చేసినంత కాలం తాము దాచుకున్న జీపీఎఫ్, ఎల్ఐసీ, ఆర్జిత సెలవుల సొమ్ములు అందుతాయని, ప్రభుత్వం నుంచి గ్రాడ్యుటీ లభిస్తుందని ఆశిస్తారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, సొంతింటి నిర్మాణం, చేసిన అప్పులు తీర్చడం ఇలా ఎన్నో ప్రణాళికలు వేసుకొని ఉంటారు. కానీ ప్రభుత్వం వారి ఆశలను అడియాశలు చేసింది. 61 ఏళ్లు పైబడి అనేక వ్యాధుల బారినపడి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
సొమ్ములు అందక విశ్రాంతి ఉద్యోగులు గోస పడుతూ తమ డబ్బులు తమకు ఇవ్వాలని వేడుకుంటున్నారు. రావాల్సిన బెనిఫిట్స్ కోసం ఎదురుచూసే వారి సంఖ్య ప్రతినెలా పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాదిన్నర కాలంలోనే ఖమ్మం జిల్లాలో 800 మందికి పైగా ఉద్యోగ విరమణ చేశారు. సాధారణంగా ఉద్యోగి రిటైర్డు అయిన తర్వాత ప్రభుత్వం తన సొంత ఖజానా నుంచి ఇచ్చేది పెద్దగా ఏమీ ఉండదు. ఉద్యోగి తన ఉద్యోగ సమయంలో దాచుకున్న సొమ్మునే చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఒక్కో ఉద్యోగికి జీపీఎఫ్, టీజీఎల్ఐసీ, కమ్యుటేషన్, గ్రాడ్యుటీ, ఆర్జిత సెలవులు సరెండర్ చేయడం వంటి వాటన్నింటి కింద రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు వస్తుంటాయి. ఒక్కో ఉద్యోగికి జీపీఎఫ్ కింద సగటున రూ.8లక్షల వరకు అందుతుంది.
ఉద్యోగి రిటైర్డు అయిన తర్వాత 40శాతం వరకు పెన్షన్‌ను ప్రభుత్వానికి అమ్ముకునే వెసులుబాటు ఉంటుంది. మిగతా 60శాతం పెన్షన్ రూపంలో ప్రతినెలా అందుతుంది. తాము అమ్ముకున్న 40శాతం పెన్షన్ సొమ్మును ఒకేసారి ప్రభుత్వం అడ్వాన్స్‌గా చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా టీజీఎల్ఐసీ కింద ఉద్యోగి మూలవేతనం నుంచి 6శాతం లేదా అంతకంటే ఎక్కువ ప్రీమియం కట్ అవుతుంది. ఇలా అనేక సౌకర్యాల ద్వారా తాము దాచుకున్న డబ్బును రిటైర్డు అయిన వెంటనే ప్రభుత్వం అందించాలి. కానీ ఏడాదిన్నర గడిచినా వారికి అందించకపోవడంతో విశ్రాంతి ఉద్యోగులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.
విశ్రాంతి ఉద్యోగులకు ఆసుపత్రుల్లో నగదురహిత వైద్యసేవలు అందడంలేదని , మెడికల్ రియంబర్స్మెంట్ రావడం లేదని కొందరు కోర్టును ఆశ్రయిస్తున్నారు. గతవారం నుంచి విశ్రాంతి ఉద్యోగులు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన దీక్షలు సాగిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రాకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
విశ్రాంతి ఉద్యోగులకు రిటైర్డుమెంట్ బెనిఫిట్స్‌ను వెంటనే అందించాలి. రావాల్సిన నగదును సకాలంలో అందక అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మరికొంతమంది పెళ్లీడుకు వచ్చిన పిల్లలు, ఇంటి నిర్మాణం, అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన డబ్బులను అందించి ఆదుకోవాలి.
-కల్యాణం నాగేశ్వరరావు, విశ్రాంతి ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి