ఖమ్మం, అక్టోబర్ 15 : ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఖమ్మం జిల్లాశాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు కళ్యాణం కృష్ణయ్య మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, న్యాయబద్ధంగా రావాల్సిన ప్రయోజనాలు, బకాయిలను విడుదల చేయకుండా వారిని తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత 18నెలలుగా రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక బకాయిలను విడుదల చేయకపోవడంతో కొంతమంది మానసిక ఆవేదనతో చనిపోతున్నారని అన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుబ్బయ్య మాట్లాడుతూ బకాయిల చెల్లింపు కోసం ఏడు వందల కోట్లు విడుదల చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డి ఆ మాట నిలుపుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కలెక్టరేట్లో ఉన్న సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని ఖమ్మం నగరానికి మార్చాలని డిమాండ్ చేశారు.
జిల్లా కార్యదర్శి తాళ్లూరి వేణు మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రిలోని వెల్నెస్ సెంటర్ను ఆధునీకరించి అన్నిరకాల మందులు, పరీక్షలు అందుబాటులో ఉంచాలని కోరారు. ధర్నా శిబిరం నుంచి కలెక్టర్ కార్యాలయంలోకి పెన్షనర్లు ప్లకార్డులతో ప్రదర్శనగా వెళ్లి తమ పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టికి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు వెంకటపతిరాజు, ఎన్.కృష్ణమోహన్, ఆర్.దుర్గాదేవి, టి.జనార్దన్, డీకే శర్మ, పూస సాంబశివరావు, మొయినుద్దీన్, రాజారావు, కృష్ణమూర్తి, బాబూరావు, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.