వైరాటౌన్, డిసెంబర్ 7 : ఖమ్మం జిల్లా వైరా పట్టణంలోని ఓ విశ్రాంత ఉద్యోగి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు. రూ.15 లక్షల సొమ్మును తన చేజేతులా తన బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్ల ఖాతాకు బదిలీ చేశారు. ఆ తర్వాత బంధువులకు తెలియడంతో వెంటనే బాధితుడితో కలిసి వైరా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. వైరా మున్సిపాలిటీలోని 13వ వార్డు పరిధిలో నివాసముంటున్న విశ్రాంత ఉద్యోగి ఊటుకూరి నర్సింహారావు ఉమ్మడి వరంగల్ జిల్లా కమలాపురంలోని ఓ పేపర్బోర్డ్లో ఉద్యోగిగా పనిచేసి రిటైర్డ్ అయ్యి వైరాలో ఉంటున్నారు. ఆయనకు శుక్రవారం మధ్యాహ్నం వాట్సప్ ఫోన్ కాల్ వచ్చింది. తాము ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేస్తున్నామని, మీరు ఐదు విమాన టికెట్లు బుక్ చేసుకున్నారని, ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నించారు.
తాను ఎలాంటి విమాన టికెట్లు బుక్ చేసుకోలేదని నర్సింహారావు సమాధానమివ్వడంతో ఈ విషయం ఏదో తేడాగా ఉందని సీబీఐకి ఫిర్యాదు అందిందని వాట్సప్ కాల్ చేసిన సదరు వ్యక్తి బెదిరించాడు. ఆ వెంటనే వీడియో కాల్లోకి వచ్చిన మరో ముగ్గురు కలిసి నర్సింహారావుతో మాట్లాడి బెదిరింపులకు పాల్పడ్డారు. వీడియో కాల్లో ఉన్న అగంతకులు నర్సింహారావుకు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నర్సింహారావు మాత్రం అగంతకులకు కనిపించారు. మీ దగ్గర హవాలా డబ్బు ఉందని, మీరు మోసంతోనే హవాలా వ్యాపారం చేస్తున్నారని, సుప్రీంకోర్టు నుంచి ఆ మేరకు సమన్లు వచ్చాయని, మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుందని బెదిరించారు. మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా విచారించాలంటే సుప్రీంకోర్టు సమన్ల మేరకు రూ.15 లక్షలను సుప్రీంకోర్టు ఆడిట్ విభాగానికి జమ చేయాలని ఆదేశించారు.
ఈ విషయాన్ని మీ బంధువులు, స్నేహితులు, పోలీసులు, ఇతరులకు ఎవరికైనా చెబితే వెంటనే అరెస్ట్ చేస్తామని బెదిరించడంతో నర్సింహారావు భయకంపితులయ్యారు. శుక్రవారం మాదిరిగానే శనివారం కూడా సైబర్ నేరగాళ్ళు నర్సింహారావుకు ఇదే విధంగా వీడియోకాల్ చేసి బెదిరించారు. కోల్‌కతాలోని బంధన్ బ్యాంకులోని రామా ఎంటర్‌ప్రైజస్ ఖాతాలో రూ.15 లక్షలు జమ చేయాలని, లేనట్లయితే వెంటనే అరెస్ట్ చేస్తామని బెదిరించారు.
దీంతో బయపడిన నర్సింహారావు శనివారం మధ్యాహ్నం వైరాలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్‌లో ఉన్న తన ఖాతా నుంచి సైబర్ కేటుగాళ్లు ఆదేశించిన ఖాతా నెంబర్‌కు రూ.15 లక్షలు బదిలీ చేశారు. మళ్లీ మరో రూ.5 లక్షలు బదిలీ చేయాలని సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు దిగారు. ఆ తర్వాత కొంతసేపటికి తమ ఇంటికి వచ్చిన బంధువులకు నర్సింహారావు భయంతో వణికిపోతూ ఈ విషయాన్ని తెలిపారు. వెంటనే బంధువులు నర్సింహారావుకు ధైర్యం చెప్పి వైరా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. వైరా పోలీసులు కేసు నమోదు చేసి రాష్ట్ర సైబర్ క్రైం విభాగానికి బదిలీ చేశారు.