కల్లూరు, ఫిబ్రవరి 16 : బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూ ప్రజలకు పోలీసు వ్యవస్థపై మరింత నమ్మకాన్ని పెంచడానికి కృషి చేయాలని సీపీ సునీల్ దత్ అన్నారు. శుక్రవారం కల్లూరు పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన ఆయన రికార్డులను తనిఖీ చేయడంతోపాటు స్టేషన్ నిర్వహణ, పోలీసుల పనితీరును తెలుసుకొని, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతలను పరిరక్షించాలని, వీటికి విఘాతం కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదన్నారు.
సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులు, అసత్య ప్రచారాలపై ఎప్పటికప్పుడు గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, రాత్రి పెట్రోలింగ్ ముమ్మరం చేయడంతోపాటు వాహన తనిఖీలు చేపట్టాలన్నారు. కేసు నమోదు విషయంలో ఆలస్యం చేయకుండా వెంటనే నమోదు చేయాలన్నారు. ఆయన వెంట కల్లూరు ఏసీపీ అనిశెట్టి రఘు, ఎస్సై షాకీర్ ఉన్నారు.