కారేపల్లి, మార్చి 18 : గ్రామాల్లో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందజేస్తున్న ఆశా కార్యకర్తలకు వేతనాలు పెంచుతూ ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే తీర్మానం చేయాలని సిఐటియు జిల్లా నాయకుడు కుందనపల్లి నరేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశా కార్యకర్తలకు నెలకు రూ.18 వేల వేతనంతో పాటు పీఎఫ్, ప్రమోషన్, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరుతూ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక ఆశా వర్కర్లతో కలిసి తాసీల్దార్ సంపత్ కుమార్కు మంగళవారం వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలీచాలని వేతనాలతో ఆశా వర్కర్లు విధులు నిర్వహిస్తూ కుటుంబాలు గడపలేని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోరుతూ ఆశా వర్కర్లు సమ్మె చేపట్టగా అధికారులు, పాలకులు హామీలు ఇవ్వడంతో విరమించడం జరిగిందన్నారు. కానీ ఇంతవరకు వారి సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. ఆశా వర్కర్లకు సంబంధించి 18 అంశాల డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తాసీల్దార్కు అందజేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల సంఘం నాయకులు సరస్వతి, లక్ష్మి, కళావతి, కుమారి, పద్మ, దేవ కరుణ, హైమావతి పాల్గొన్నారు.