భద్రాచలం, మార్చి 28: ఆరంతస్తుల భవనం కూలిన ప్రమాదంలో రెండో మేస్త్రీ ఉపేందర్ కూడా విగతజీవుడయ్యాడు. శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో సహాయక బృందాలు అతడి మృతదేహాన్ని శిథిలాల నుంచి బయటకు తీశాయి. భద్రాచలం పట్టణంలోని పంచాయతీ కార్యాలయం సమీపంలో ఈ నెల 26న నిర్మాణంలో ఆరు అంతస్తుల భవనం కుప్పకూలిన విషయం విదితమే. ఆ భవన శిథిలాల్లో పలువురు ఉన్నట్లు తొలుత ప్రచారం జరిగినప్పటికీ శుక్రవారం రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిన తరువాత ఇద్దరే ఉన్నట్లు స్పష్టత వచ్చింది.
ఇందులో కొన ఊపిరితో ఉన్న ఒక మేస్త్రీ కామేశ్వరరావును సహాయ బృందాలు గురువారం తెల్లవారుజామున బయటకు తీశాయి. భద్రాచలం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న క్రమంలోనే అతడు ప్రాణాలు విడిచాడు. శిథిలాల కింద చిక్కుకున్న వారి జాడ కోసం రెస్క్యూ బృందాలు 36 గంటలపాటు తీవ్రంగా శ్రమించాయి. శుక్రవారం తెల్లవారుజామున రెండో మేస్త్రీ ఉపేందర్ కూడా విగతజీవిగా లభ్యం కావడంతో అతడి మృతదేహాన్ని కూడా బయటకు తీసుకొచ్చారు. శిథిలాల కింద వీరిద్దరే ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. మరెవ్వరూ లేకపోవడంతో అటు అధికారులు, ఇటు పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ నెల 26న బుధవారం మధ్యాహ్నం ప్రమాదం జరిగినప్పటి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకూ అధికారులు, సహాయక బృందాల సభ్యులు నిర్విరామంగా శ్రమించారు. కుప్పకూలిన ఆరు అంతస్తుల శిథిలాలను యంత్రాలతో తొలగిస్తూ, ఆ శిథిలాల కింద చిక్కుకున్న వారి జాడ కోసం అన్వేషిస్తూ ముందుకు సాగారు. స్థానిక పంచాయతీ సిబ్బంది సహకారంతో సింగరేణి, ఐటీసీ సంస్థల రెస్క్యూ టీం సభ్యులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాల సభ్యులు విరామం లేకుండా చెమటోడ్చారు. కలెక్టర్, ఎస్పీ, ఐటీడీఏ పీవో, ఏఎస్పీ, ఆర్డీవో వంటి ఉన్నతాధికారులు కూడా తక్షణమే స్పందించి సహాయక చర్యలను ముమ్మరం చేసి పర్యవేక్షించారు. కానీ, శిథిలాల్లో చిక్కుకున్న ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడం.. చివరికి విషాదాన్ని మిగిల్చింది.