ప్రజల ఓట్లను దక్కించుకునేందుకు ఎన్నో మాయమాటలు చెప్పారు. నోటికొచ్చిన 420 హామీలు గుప్పించారు. కానీ అధికారం చేజిక్కించుకుని 420 రోజులు దాటినా అతీగతీ లేదు. ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదు. రైతన్నలకు రైతుభరోసాపై ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామంటూ ఊరూరా సర్వేల పేరుతో ఊరించారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించలేదు. పింఛన్ల పెంపు ఊసెత్తడం లేదు. రేషన్‌కార్డుల జాడేలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 420 రోజులైనా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు మహాత్మాగాంధీ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించి నిరసన తెలిపారు.
మణుగూరు పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి వినతిపత్రం సమర్పించారు. ఇల్లెందులో మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియానాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగల రాజేందర్, దమ్మపేటలో మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు గాంధీ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించారు. కొత్తగూడెంలో మున్సిపల్ మాజీ చైర్ప ర్సన్ కాపు సీతాలక్ష్మి, భద్రాచలంలో పార్టీ నియోజకవర్గ నాయకుడు మానె రామకృష్ణ గాంధీ విగ్రహాలకు పూలమాల వేసి వినతిపత్రాలు అందజేశారు. ఖమ్మం నగరంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్జేసీ కృష్ణ, నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
సత్తుపల్లి, మధిర , వైరా నియోజక వర్గాల్లో ఆ పార్టీ నేతలు గాంధీ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించి నిరసన తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కారని, ఆ తర్వాత కనీసం నాలుగు హామీలు కూడా నెరవేర్చలేకపో యారని ఎద్దేవా చేశారు. రైతుభరోసా పథకాన్ని కేవలం ఒక్కో గ్రామానికే పరిమితం చేసి చేతులు దులుపుకున్నారని, ప్రజాపాలన, గ్రామసభల్లో కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు తీసుకొని వాటిని అర్హులకు కాకుండా అనర్హులకు ఇచ్చారని మండిపడ్డారు.
గూడులేని నిరుపేద లకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని ముఖ్యమంత్రి, మంత్రులు పదే పదే వేదికలపై ప్రకటించినా.. ఆ పార్టీ అనుకూల వ్యక్తులకే వర్తించేలా జాబితాలు రూపొందించి గ్రామసభల్లో చదివి వినిపించారని, ఇది ఎంతవరకు సబబు అని వారు ప్రశ్నించారు. ఆయా పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ వర్తింపజేయాలని వివిధ రూపాల్లో ఆందో ళనలు చేస్తున్నా వాటిని ఎప్పుడు ఇస్తారో చెప్పలేకపోతున్నారని, చేతగాని హామీలు ఎందుకు ఇవ్వాలని వారు ప్రశ్నించారు.
– ఖమ్మం, జనవరి 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / భద్రాద్రి కొత్తగూడెం (నమస్తే తెలంగాణ)