బోనకల్లు, జూన్ 23 : బోనకల్లు మండల పరిధిలోని వైరా-మధిర ప్రధాన రహదారికి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని సీపీఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రజావాణిలో తాసీల్దార్ రమాదేవికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైరా-మధిర ప్రధాన రహదారిపై బోనకల్లు క్రాస్ రోడ్డు, రాపల్లి స్టేజీ, బ్రాహ్మణపల్లి, కలకోటల వద్ద రోడ్డు అధ్వాన్నంగా తయారైందన్నారు. దీనివల్ల వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.
రోడ్డుపై పెద్ద గుంటలు పడడంతో అత్యవసర సమయాల్లో అంబులెన్స్ లో రోగులను మధిర, ఖమ్మం ప్రాంతాలకు చేర్చడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. రోడ్డు దెబ్బతిని గుంటలు పడ్డ ప్రదేశాల్లో వర్షపు నీరు చేరి ప్రమాదంగా మారాయన్నారు. ఇప్పటికైనా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దృష్టి సారించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల సమితి సభ్యులు కొంగర భాస్కరరావు, గుంపుల జయరాజు, జి కృష్ణారావు పాల్గొన్నారు.