బూర్గంపహాడ్, ఏప్రిల్ 10 : సమస్యలు పరిష్కరించేందుకు కార్మిక సంఘాల నాయకులను యాజమాన్యం పిలవని పక్షంలో ఏ క్షణంలోనైనా సమ్మెకు దిగుతామని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రారెడ్డి, బల్లెం నాగయ్య, ఎండీ యాకూబ్ పాషాలు హెచ్చరించారు. అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టు కార్మికులు సారపాక ఐటీసీ ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం 16వ రోజుకు చేరాయి.
దీక్షల్లో కందాల వెంకటరెడ్డి, చుక్కపల్లి బాలాజీ, రూప కల్యాణ్, వల్లోజి కమల, వర్కా సుజాతలు కూర్చోగా.. ట్రేడ్ యూనియన్ ఆఫ్ ఇండియా(టీయూసీఐ) జిల్లా అధ్యక్షుడు ఆర్.మధుసూదన్‌రెడ్డి, సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా భద్రాచలం డివిజన్ కమిటీ సభ్యులు సాయిబాబు, మాజీ సర్పంచ్ దరావత్ చందునాయక్, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సానికొమ్ము శంకర్‌రెడ్డి, కొమ్మూరి రవీంద్రనాథ్, బీఎంఎస్ జనరల్ సెక్రటరీ పొలినేడి శ్రీనివాసరావులు మద్దతు పలికారు.
ఈ సందర్భంగా జేఏసీ బాధ్యులు మాట్లాడుతూ కార్మికులు రిలే దీక్షలు చేపట్టి 16 రోజులైనా ఐటీసీ యాజమాన్యం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. దీక్షా శిబిరంలో జేఏసీ సభ్యులు ఆకిని సర్వేశ్వరరావు, మర్రి వెంకటరెడ్డి, సుంకిరెడ్డి వెంకటరెడ్డి, గోపిరెడ్డి ఓబుల్‌రెడ్డి, బాబు, ప్లాంటేషన్ మహిళా కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.