భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఉద్యమ పార్టీకి ప్రజలు మళ్లీ పట్టం కడతారని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు స్పష్టం చేశారు. ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ (అప్పట్లో టీఆర్ఎస్) స్థాపితమై 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 27న వరంగల్లో ఏర్పాటుచేస్తున్న భారీ బహిరంగ సభకు, పార్టీ రజతోత్సవానికి ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
కొత్తగూడెంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన వరంగల్ సభ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏదో ఆశకు పోయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకొని తప్పుచేశామని ప్రజలు మదనపడుతున్నారని అన్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ పాలనలో ఎక్కడా అభివృద్ధి కన్పించడం లేదని ప్రజలే చెబుతున్నారని అన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామంటూ ఊదరగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఒక్క గ్యారెంటీ హామీని కూడా వంద శాతం అమలు చేయలేకపోయిందని విమర్శించారు.
ఆస్తులు అమ్మడం, అప్పులు తేవడమే కాంగ్రెస్ సర్కారు లక్ష్యమని విమర్శించారు. ఇప్పటికీ రుణమాఫీని సంపూర్ణంగా చేయలేకపోయిందని ధ్వజమెత్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేయాలన్న సంకల్పంతో నాడు కేసీఆర్ కట్టిన సీతారామ ప్రాజెక్టుపై కాంగ్రెస్ పాలకులు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. ఆ ప్రాజెక్టును వారే కట్టినట్లుగా గప్పాలు కొట్టుకుంటున్నారని దుయ్యబట్టారు. రజతోత్సవ సభకు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ పాలిట భూతంగా రేవంత్ సర్కారు తయారైందని కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు విమర్శించారు. కాంగ్రెస్ మెడలు వంచేందుకే వరంగల్లో భారీ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎన్నో అవమానాలు, అవహేళనలను దాటుకొని ఉద్యమం ద్వారా తెలంగాణను సాధించుకున్న బీఆర్ఎస్ మాత్రమే రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఉద్యమ నాయకుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్, బీఆర్ఎస్ నాయకులు కిలారు నాగేశ్వరరావు, కాపు సీతాలక్ష్మి, కాపు కృష్ణ, దామోదర్, సోనా, శాంతి, కొట్టి వెంకటేశ్వర్లు, ముంతపురి రాజుగౌడ్, సంకుబాపన అనుదీప్, సింధు తపస్వి, బత్తుల వీరయ్య, అన్వర్ పాషా, పూసల విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సింగరేణి కార్మికులు పలువురు సీఐటీయూ నుంచి టీబీజీకేఎస్లో చేరారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు వీరికి గులాబీ కండువాలు కప్పారు.