భద్రాద్రి కొత్తగూడెం, జూలై 11 (నమస్తే తెలంగాణ): సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాకు నీళ్లు వెళ్తున్నాయంటే అది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుణ్యమేనని, కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కాలువలు కూడా తీయలేని పరిస్థితి ఉందని, ఇక మీరు చేసిన అభివృద్ధి ఎక్కడుందో చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మండిపడ్డారు. మీ సర్వేలో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుందనే అక్కసుతోనే బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేసి తిట్ల పురాణం మొదలు పెట్టారని, ఇది వినలేక మహిళలు రైతు భరోసా సభ నుంచి బయటకు వెళ్లిపోయారని గుర్తు చేశారు.
కొత్తగూడెంలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రేగా మాట్లాడారు. రైతులను అన్ని విధాల ఆదుకుంటామని చెప్పి, రైతు భరోసా నిధులు పూర్తిస్థాయిలో జమ చేయకుండా ఏదో గొప్ప చేసినట్లు రైతు భరోసా సభ పెట్టారని, ఇది కేవలం బీఆర్ఎస్ ఎదుగుదలను ఓర్వలేక తిట్ల పురాణం మొదలుపెట్టినట్లుగా ఉందని విమర్శించారు.
మాట్లాడేందుకు ఏమీ లేకపోవడంతో మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ను టార్గెట్ చేసి బూతులు తిట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా కాళేశ్వరం పేరుతో బురద రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. సర్వేలు ఎన్ని చేయించుకున్నా ఒక్క సర్వేలో కూడా కాంగ్రెస్‌కు అనుకూలంగా రాలేదని, దీంతో మతిభ్రమించి పిచ్చికూతలు కూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో మీరే కాదు.. మీ బృందం అంతా ఓడిపోవడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.
ఊహల్లో తప్పుడు లెక్కలు వేసుకుని 117 సీట్లు వస్తున్నాయని భ్రమపడుతున్నారేమో కానీ, మీ లక్కీ నంబర్ 9 సీట్లకు మించి రావని రేగా అన్నారు. భద్రాద్రి జిల్లాలో ఉన్న ప్రాజెక్టులన్నీ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కట్టినవేనని, ఈరోజు సీతారామ నీళ్లు ఖమ్మానికి వెళ్తున్నాయంటే అది మా అధినేత కేసీఆర్ పుణ్యమేనని అన్నారు. సీతారామ కట్టిన తర్వాత వైరా మీదుగా ఖమ్మానికి నీళ్లు తరలించుకుపోతున్నారని ఆరోపించారు. భద్రాద్రికి సాగునీరు ఇవ్వకపోతే రైతులు తగిన బుద్ధి చెబుతారన్నారు. చెప్పుకునేందుకు ముగ్గురు మంత్రులు ఉన్నా.. ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసం వారు ఒక్క పని కూడా చేయలేదని మండిపడ్డారు. దమ్ముంటే రైతులకు ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీ లెక్కలు బయట పెట్టాలన్నారు.
గత ప్రభుత్వంలో చనిపోయిన ప్రతి రైతుకు రైతుబీమా ఇచ్చామని, కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలో వంద మంది రైతు కుటుంబాలకు రైతుబీమా ఇవ్వలేకపోయిందన్నారు. వానకాలం సీజన్లో రైతులకు కనీసం ఎరువులు కూడా ఇవ్వలేకపోతున్నారని, యాప్‌ల పేరుతో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లాలో పదికి పది సీట్లు గెలుచుకుంటుందని దీమా వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, కార్పొరేటర్ సింధు తపస్వి, నాయకులు రవిచంద్ర, రాజుగౌడ్, మునీర్, అనుదీప్, కొట్టి వెంకటేశ్వర్లు, దామోదర్, లావుడ్యా సత్యనారాయణ, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.