మణుగూరు టౌన్, నవంబర్ 12: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, డబ్బులు పంచినా విజయం మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతదేనని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు స్పష్టం చేశారు. నిజాయితీగా చేసిన సర్వేలు వంద శాతం బీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుందని తేల్చి చెప్పాయని గుర్తుచేశారు. మణుగూరులో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే ముస్లిం మైనార్టీల ఓట్లను రాబట్టుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి అప్పటికప్పుడు అజారుద్దీన్‌ను మంత్రిగా నియమించారని విమర్శించారు.
ఒక మహిళపై గెలవడానికి అనేక కుట్రలు చేశారని ఆక్షేపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పాలనలో హైదరాబాద్‌లో చెత్త తీసే పరిస్థితి లేదని, కనీసం పాలనపై కూడా దృష్టి పెట్టలేదని విమర్శించారు. కేవలం కేసీఆర్, కేటీఆర్‌లను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు డబ్బులు పంపిణీ చేస్తున్నారని, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఎన్నికల కమిషన్‌కు తమ పార్టీ నేతలు అనేకమార్లు ఫిర్యాదు చేశారని అన్నారు.
ఎంపీ వద్దిరాజు రవిచంద్రపై కూడా దాడులు చేశారని, చివరి క్షణంలో దొంగ ఓటర్లను దింపితే బీఆర్ఎస్ నాయకులు వారిని పట్టుకొని చూపించినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఉప ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్ అధికారులు, పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు కట్టగట్టుకొని బీఆర్ఎస్ అభ్యర్థినిపై పోటీకి రావడం సిగ్గుచేటన్నారు. బీఆర్ఎస్ నాయకులు కుర్రి నాగేశ్వరరావు, అక్కి నరసింహారావు, వేల్పుల సురేశ్, ముత్యం బాబు, ముద్దంగుల కృష్ణ, అడపా అప్పారావు, వట్టం రాంబాబు, తాళ్లపల్లి యాదగిరి గౌడ్, తురక రాంకోటి, రవి, సృజన్, రంజిత్, పద్దం శ్రీను పాల్గొన్నారు.