“రేవంత్రెడ్డి ప్రభుత్వానికి ఉద్దెర ముచ్చట్లు ఎక్కువ.. పని తక్కువ… ఇంత అధ్వానమైన ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలే… సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటమా సిగ్గు సిగ్గు… కళ్లున్నా చూడలేని కబోదులు స్థానిక మంత్రులు… జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నా.. నిధులు సున్నా… జిల్లా ఎమ్మెల్యేలు అంతా ‘ఎస్ బాస్’ లే… కమీషన్ల మీద ఉన్న శ్రద్ధ అభివృద్ధి మీద లేకపాయే… జిల్లా అధికారులకు ఎన్ని ముడుపులు ముట్టాయి.. ఎందుకు దొంగలను సపోర్టు చేస్తున్నారు… గుంతలమయమైన రహదారులను వెంటనే అభివృద్ధి అంటూ గులాబీ దళం నినదించింది. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు,
పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపు మేరకు గత వారంరోజులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా అధ్వానంగా ఉన్న రహదారుల వద్దకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వెళ్లి సెల్ఫీలు దిగి కాంగ్రెస్ సర్కారుకు నిరసన గళం వినిపించారు. సోమవారం ఆయా రహదారులపై ర్యాలీలు, ధర్నాలు చేశారు. ఈ సందర్భంగా మణుగూరులో రేగా కాంతారావు మాట్లాడుతూ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా రహదారులకు ఒక్క రూపాయి నిధులు కూడా విడుదల కాలేదని, ఇది కాంగ్రెస్ అసమర్థతకు నిదర్శనమన్నారు.
జిల్లాకు వచ్చే రూ.200 కోట్ల నిధులు ఎక్కడికి పోతున్నాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ప్రజాపాలన చతికిలపడిందని ఆరోపించారు. ములకలపల్లి మండల కేంద్రంలో అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా అభివృద్ధి లేదని, గత బీఆర్ఎస్ పాలనలో వేసిన రోడ్లు తప్ప కొత్తగా అభివృద్ధి ఏమీ చేయలేదన్నారు. – నమస్తే నెట్వర్క్, అక్టోబర్ 27