ఖమ్మం, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరుపుకోనున్న పాతికేళ్ల పండుగకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి గులాబీదండు కదలనుంది. ఆ రోజున జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు అవిభాజ్య ఖమ్మం జిల్లా నుంచి తండోపతండాలుగా తరలివెళ్లేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. సరిగ్గా వారం రోజుల సమయం మాత్రమే ఉండడంతో రజతోత్సవంలో పాల్గొనేందుకు పిల్లాపాపలతో కదిలేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా గులాబీ నాయకత్వం రజతోత్సవ సభ జయప్రదానికి సిద్ధమవుతుంది. ఈ మేరకు ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయమైన తెలంగాణభవన్‌లో ఆదివారం ఉమ్మడి జిల్లా నేతలు సమావేశమయ్యారు. వరంగల్ సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలివెళ్లేలా ప్రణాళికను రూపొందించారు.
ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా ర్టీ అధ్యక్షుడు తాతా మధు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కందాల ఉపేందర్‌రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, హరిప్రియానాయక్, మదన్‌లాల్, చంద్రావతి, ఖమ్మం జడ్పీ, టీఎస్ సీడ్స్ మాజీ చైర్మన్లు లింగాల కమల్‌రాజు, కొండబాల కోటేశ్వరరావు, ఇతర నేతలు రావులపల్లి రాంప్రసాద్, మానే రామకృష్ణ హాజరయ్యారు.
రజతోత్సవ సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలివెళ్లనున్న నేపథ్యంలో వారికి వాహనాలు, భోజనాలు, తాగునీళ్లు తదితర ఏర్పాట్లపై చర్చించారు. వీటి కోసం ఇన్చార్జులను నియమించారు. బహిరంగ సభకు వెళ్లే రూట్‌మ్యాప్, పారింగ్ తదితర విషయాలపై సమాలోచనలు చేశారు. ఈ నెల 25న ఉమ్మడి జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో 27న పార్టీ జెండాలను ఆవిషరించాలని నిర్ణయించారు.
అలాగే, గ్రామాల్లో ఇప్పటికే ఉన్న పార్టీ దిమ్మెలను ముస్తాబు చేయాలని, దిమ్మెలు లేని గ్రామాల్లో వెంటనే నిర్మించాలని తీర్మానించారు. 27న ఉదయం అన్ని గ్రామాల్లో పార్టీ దిమ్మెలపై గులాబీ జెండాలను ఆవిషరించాలని, కేటాయించిన వాహనాల్లో వరంగలకు బయలుదేరాలని సూచించారు. పార్టీ ముఖ్య నాయకులు ఉప్పల వెంకటరమణ, దిండిగాల రాజేందర్, పగడాల నాగరాజు, ముత్యాల వెంకట అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
ఆళ్లపల్లి, ఏప్రిల్ 20: బీఆర్ఎస్ పాతికేళ్ల పండుగను విజయవంతం చేయాలని పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపునిచ్చారు. ఈ పాతికేళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుంటూ ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించుకోబోతున్న రజతోత్సవ సభ ఎంతో ముఖ్యమైనదని అన్నారు. రజతోత్సవాన్ని జయప్రదం చేసేందుకు ఆళ్లపల్లి మండలం కేంద్రంలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో రేగా కాంతారావు మాట్లాడారు.
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చే అభ్యర్థులను గెలిపించి వార్ వన్‌సైడ్ చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం రజతోత్సవ సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. బీఆర్ఎస్ నాయకులు కొమరం హనుమంతరావు, కోండ్రు మంజుభార్గవి, పాయం నరసింహారావు, షేక్ బాబా, రావుల సొమయ్య, కొమరం వెంకటేశ్వర్లు, ఖయ్యూం, భద్రం, బాబు, సత్యం, సాంబయ్య, సాయన్న, కిశోర్‌బాబు, లక్ష్మయ్య, నాగేశ్, నరసింహారావు, నరేశ్, ముసలయ్య తదితరులు పాల్గొన్నారు.