మణుగూరు టౌన్/ దుమ్ముగూడెం, ఫిబ్రవరి 23: ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్దే గెలుపని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పష్టం చేశారు. ఇప్పటికప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఒక్కసీట్లోనూ కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదని తేల్చిచెప్పారు. మణుగూరు, దుమ్ముగూడెం మండలాల్లో ఆదివారం ఆయన పర్యటించారు. తొలుత మణుగూరులోని బీఆర్ఎస్ కార్యాలయలో పార్టీ నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్లను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ దుష్ట పాలనను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో అనునిత్యం పర్యటిస్తూ పార్టీ బలోపేతం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. ఎన్నికల హామీల్లో ఏ ఒక్కదానినీ నేరవేర్చని సీఎం.. రేవంత్రెడ్డి మాత్రమేనని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు కుర్రి నాగేశ్వరరావు, కుంట లక్ష్మణ్, నూకారపు రమేశ్, వట్టం రాంబాబు, యూసుఫ్, యాదగిరి గౌడ్, ఆవుల నరసింహారావు, ముద్దంగుల కృష్ణ, అక్కి నరసింహారావు, పాకాల రమాదేవి, పిన్నమనేని మాధవి, యూత్ నాయకులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ దుమ్ముగూడెంలో మండల కో-కన్వీనర్ ఎండీ జానీపాషా సతీమణి గజలక్ష్మి గుండె సమస్యతో బాధపడు తున్న విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు.. ఆదివారం ఆమె నివాసానికి వెళ్లి ఆమెను పరామర్శించారు. హైదరాబాద్ ఆసుపత్రికి వెళ్తున్న ఆమెకు ధైర్యం చెప్పారు.