గత కేసీఆర్ సర్కార్ హయాంలో రియల్ ఎస్టేట్ రంగం ‘మూడు పువ్వులు – ఆరు కాయలు’గా సాగింది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో భూముల ధరలు అమాంతం పెరిగాయి. ఎకరం రూ.5 లక్షల్లోపు ఉన్న భూములు రూ.కోట్లకు చేరాయి. తెలంగాణలో ఎకరం భూమి ఉన్న రైతుని కోటీశ్వరుడు అనే పరిస్థితికి చేరింది. గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా తెలంగాణలో భూముల కొనుగోలుకు ఆసక్తి చూపారు. సరిహద్దు ప్రాంతంగా ఉన్న ఖమ్మం జిల్లాలో ఏపీ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేశారు. కానీ ఇప్పుడంతా సీన్ రివర్స్ అయింది.
-ఖమ్మం, జూన్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ‘రియల్ ఎస్టేట్’ కుప్పకూలింది. రూ.కోట్లు పలికిన భూముల విలువ ఒక్కసారిగా తగ్గిపోయింది. ఖమ్మం జిల్లాలో భూములను కొనే నాథుడు లేకపోయాడు. రియల్ ఎస్టేట్ రంగాన్ని నమ్ముకున్న వ్యాపారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీనికి తోడు.. ఆదాయమే పరమావధిగా చేసుకుందామనుకున్న కాంగ్రెస్ సర్కార్.. తాజాగా భూముల, ఆస్తుల మార్కెట్ విలువను వంద శాతం వరకూ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయమే మూలిగే నక్కపై తాటి పండు పడిన చందంగా మారింది. పేద, మధ్యతరగతి ప్రజలు ఓ ప్లాటో, ఒక ఎకరం భూమో కొనుక్కుంటే వాటిని రిజిస్ట్రేషన్ చేయించుకునే పరిస్థితి లేకపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం భూముల ధరల పెంచడంతో రిజిస్ట్రేషన్లపై భారం పడిందని జిల్లా ప్రజలు, స్థిరాస్తి వ్యాపారులు భగ్గుమంటున్నారు.
రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటున్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూముల ధరలు అమాంతం పెంచడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలపై పెనుభారం మోపినట్లయింది. దీంతో ఖమ్మం జిల్లాలో సామాన్య ప్రజలు ప్లాట్లు కొనాలంటేనే జంకుతున్నారు. ప్రాంతాన్ని బట్టి మార్కెట్ విలువ ఏకంగా రెండు, మూడు రెట్లు పెరగడంతో రిజిస్ట్రేషన్ చార్జీలు దడ పుట్టిస్తున్నాయి. రేవంత్ సర్కారు భూముల విలువను పెంచి ప్లాట్లు, భూములు కొనుగోలు చేయాలనుకునే మధ్యతరగతి కుటుంబాల ఆశలపై నీళ్లు చల్లింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఖజానా నింపుకునే పనిలో భాగంగా భూముల రేట్లు పెంచి రియల్ ఎస్టేట్, దాని అనుబంధ రంగాలపై తీవ్ర ప్రభావం పడేలా చేసింది.
ఖమ్మం నగరంలోని చుట్టు పక్కల ప్రాంతాల్లో గతంలో రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉండగా ప్రస్తుతం రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు పెరిగింది. దీంతో ఒక్క ఎకరం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ప్రస్తుతం రూ.లక్ష పైచిలుకు అవుతోంది. అంతేగాక, ఖమ్మం నగరంలో ప్లాట్ విలువ రూ.3,500 నుంచి రూ.3,800 వరకు ఉండగా ప్రస్తుతం రూ.5,500 వరకు చేరింది. దీని ప్రకారం 100 గజాల ప్లాటు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే గతంలో రూ.20 వేల వరకు ఖర్చవగా ప్రస్తుతం అది రూ.50 వేలకు పెరిగింది. దీనికి తోడు గతంలో ఎంతో ఆశతో భూములు, ప్లాట్లు కొనుగోలు చేసి ఆపదలో అమ్ముకుందాములే అనుకొని ఎదురుచూస్తున్న మధ్యతరగతి ప్రజలకు ప్రస్తుతం వాటిని అమ్ముకునే పరిస్థితి లేక, కొనే దిక్కులేక తలలు పట్టుకుంటున్నారు.
ప్లాట్లు, భూముల రిజిస్ట్రేషన్ ధరలు అమాంతం పెరగడంతో రిజిస్ట్రేషన్లు లేక రిజిస్ట్రార్ కార్యాలయాలు, తహసీల్ ఆఫీసులు వెలవెలబోయి కనిపిస్తున్నాయి. ఐదు రోజుల వరకు ఖమ్మం జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీసులో రోజుకు 50 నుంచి 60 రిజిస్ట్రేషన్లు కాగా ప్రస్తుతం ఆ సంఖ్య గణనీయంగా 4 నుంచి 5కు చెరింది. దీనిని బట్టి రాష్ట్ర ప్రభుత్వం భూముల ధర పెంపు నిర్ణయం రిజిస్ట్రేషన్లపై ఎంతటి తీవ్రమైన ప్రభావాన్ని చూపిందో అర్థం చేసుకోవచ్చు. ఖమ్మం నగరంతోపాటు వైరా, మధిర, కూసుమంచి, ఖమ్మం రూరల్, సత్తుపల్లి, కల్లూరు, పెనుబల్లి ప్రాంతాల్లో గతంతో పోలిస్తే రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. ధరలు మరింత పెరుగుతాయన్న భయంతో కొందరు కొనుగోళ్లు వాయిదా వేసుకుంటుండగా.. మరికొందరు కొనేందుకు పూర్తిగా వెనక్కి తగ్గుతున్నారు. ఏళ్ల తరబడి పొదుపు చేసిన సొమ్ముతో చిన్న ఇంటి స్థలం కొనుగోలు చేయాలనుకున్న మధ్యతరగతి కుటుంబాలు ప్రస్తుతం ఆలోచనలో పడ్డాయి. ఓ వైపు బ్యాంకు రుణాలు, మరో వైపు పెరిగిన రిజిస్ట్రేషన్ ఖర్చులు భరించలేక కొనుగోళ్లను నిలివేసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదాయం పెంచుకునే ఉద్దేశంతో మార్కెట్ విలువ పెంచి సామాన్య ప్రజలపై వేసిందని పెదవి విరుస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం భూముల విలువ మరింత పెంచడం దారుణం. రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుతో ఇంటి నిర్మాణంపై కూడా ప్రభావం పడుతోంది. ప్రభుత్వాన్ని నడపలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా పేదలపై భారాన్ని వేసి ముక్కు పిండి వసూలు చేయాలనుకుంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పనితీరుకు ఈ నిర్ణయం నిదర్శనం. చేతకాని ప్రభుత్వం వల్ల ప్లాట్లు కొని ఇళ్లు కట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది.
-చిలుమూరు కోటి, రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఖమ్మం
స్థలం కొనడానికి సిద్ధమైతే రిజిస్ట్రేషన్ ఖర్చులూ భయపెడుతున్నాయి. ప్రభుత్వం పెంచిన విలువలతో అదనంగా లక్షల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. దీంతో చాలామంది కొనుగోళ్లు వాయిదా వేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రియల్ ఎస్టేట్ నడవక, ప్లాట్లు, ఇళ్లు అమ్మకం, కొనుగోళ్లు జరగక ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు భూముల మార్కెట్ విలువ పెరగడంతో రిజిస్ట్రేషన్ ధరలు పెరిగి సామాన్యుడిపై మరింత భారాన్ని మోపాయి.
-తంగెళ్లపల్లి శ్రీనివాసరావు, రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఖమ్మం
ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని భూముల మార్కెట్ విలువల పెంపును కాంగ్రెస్ ప్రభుత్వం పునఃసమీక్షించుకోవాలి. కనీసం పేద, మధ్య తరగతి కుటుంబాలకు రిజిస్ట్రేషన్ రుసుముల్లో రాయితీలు కల్పించాలి. సామాన్యుడి సొంతింటి కలను మరింత దూరం చేసేలా భూముల మార్కెట్ విలువల పెంపుదల ఉంది.
-తోట వెంకన్న, ఖానాపురం హవేలీ, ఖమ్మం అర్బన్
కాంగ్రెస్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చార్జీలను విపరీతంగా పెంచింది. ఖమ్మం నగరం ఖానాపురం హవేలీ, టేకులపల్లిల్లో గతంలో గజం రూ.4,100గా ఉంది. ఇప్పుడు అదే గజం ధరను ఏకంగా రూ.6,200కు పెంచారు. రెండు వందల గజాలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌కు వస్తే రూ.లక్ష పైచిలుకు ఖర్చు అయింది. గతంలో రూ.50 వేల నుంచి రూ.60వేలతో అయ్యేది.
-వాకదాని శ్రీహరి, టేకులపల్లి, ఖమ్మం