ఖమ్మం, మే 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండి కూడా ఏ ప్రయోజనం జరిగిందో జిల్లా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. గడిచిన పదేళ్లలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ జిల్లాలో సీతారామ ప్రాజెక్టును నిర్మించి 10 లక్షల ఎకరాలకు నీరందించే అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారని గుర్తుచేశారు. కానీ 17 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన ఎనుమల రేవంత్‌రెడ్డి దివాలాకోరు ముఖ్యమంత్రి అని విమర్శించారు.
ఇన్నేళ్ల తన రాజకీయ అనుభవంలో ఏ ముఖ్యమంత్రి కూడా రేవంత్‌రెడ్డిలా దివాలాకోరు మాటలు మాట్లాడలేదని గుర్తుచేశారు. తల్లాడ మండలం మిట్టపల్లిలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్, దివంగత రాయల శేషగిరిరావు కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి శుక్రవారం కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కోసం, పేదల అభ్యున్నతి కోసం శేషగిరిరావు చేసిన సేవలను కేటీఆర్ కొనియాడారు. దివంగత రాయల శేషగిరిరావు.. తన జీవితం మొత్తం ఈ ప్రాంత రైతుల కోసమే శ్రమించారని గుర్తుచేశారు.
అనంతరం.. సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షతన మిట్టపల్లిలో జరిగిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు. ఢిల్లీకి పోతే దొంగల్లా చూస్తున్నారంటూ, కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదంటూ, అపాయింట్మెంట్ అడిగితే చెప్పులు ఎత్తుకుపోయేటోడిలా చూస్తున్నారంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల మాట్లాడిన మాటలను కేటీఆర్ ఉటంకిస్తూ సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన దొంగను దొంగలా చూడకుంటే దొరలా చూస్తారా?’ అంటూ ఎద్దేవా చేశారు.
రైతులందరూ వెంటనే బ్యాంకులకు వెళ్లి పంట రుణాలు తెచ్చుకోవాలంటూ, డిసెంబర్ 9న తొలి సంతకం రుణమాఫీ ఫైలు పైనే పెడతామంటూ రైతులకు హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి.. వారిని నిలువునా మోసం చేశారని మండిపడ్డారు. ఆడబిడ్డల ఓట్ల కోసమే కాంగ్రెసోళ్లు ఆనాడు ఫ్రీ బస్సు, తులం బంగారం అంటూ హామీలు ఇచ్చారని విమర్శించారు.
కానీ.. ఆ అందమైన హామీల వలలో పడిన మహిళామణులు నేడు మోసపోయి గోసపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చిన కాంగ్రెసోళ్లు.. ఇప్పుడు వాటిని అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. అయితే, ఆ గ్యారెంటీలను, హామీలను అమలుచేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఖమ్మం జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. మధిరలో బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్రాజుపై గెలిచేందుకు అఫిడవిట్లు రాసి ఇచ్చాడని, దేవుడి దగ్గరకు తీసుకెళ్లి బాండ్ పేపర్ల మీద సంతకాలు చేసి ఇచ్చారని, ఇంకా అనేక విధాలుగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారని విమర్శించారు. ఆనాడు కాంగ్రెసోళ్లు గల్లీగల్లీలో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారని, ఊదరగొట్టే మాటలు చెప్పారని, అలవిగాని హామీలు ఇచ్చారని గుర్తుచేశారు.
కానీ.. ఈ 17 నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలకు జరిగిన మేలేమీ లేదని, పైగా ఉన్న పథకాలకే దిక్కులేకుండా పోయిందని విమర్శించారు. మాతా, శిశు మరణాలను తగ్గించి ఆడబిడ్డలకు రూ.13 వేల పారితోషికం ఇచ్చే కేసీఆర్ కిట్టు అనే అద్భుతమైన కార్యక్రమాన్ని కూడా ఎత్తేశారని మండిపడ్డారు. ‘రైతుబంధు పెట్టుబడి సాయాన్ని రెండు పంటలకే ఇస్తారా? మూడో పంటకు ఇవ్వరా?’ అని ఆనాడు తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు అతడి పాలనలో ఒక్క పంటకే రైతుభరోసాను సరిగ్గా ఇచ్చే దిక్కులేకుండా పోయిందని దుయ్యబట్టారు.
త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా ఏమిటో చూపించాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రజల్లో ఉండే గులాబీ జెండాయే తెలంగాణ ప్రజల గుండె ధైర్యమనే విషయాన్ని నిరూపించాలన్నారు. భద్రాచలం ఉప ఎన్నిక వచ్చినప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులమందరమూ వెళ్లి ఆ సీటును అద్భుతమైన మెజారిటీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ఏ ఎన్నిక వచ్చినా ఢిల్లీ పార్టీలను నమ్మి మోసపోవద్దని కోరారు. ఇంటి పార్టీలే ముద్దని వ్యాఖ్యానించారు.
తమ బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో అమలు చేసిన పథకాలను రద్దు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని దుయ్యబట్టారు. ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయలేని ప్రభుత్వాలను రీకాల్ చేసే విధానం భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందని అన్నారు. గడిచిన 17 నెలలుగా ఏ కష్టం వచ్చినా నిలబడేది బీఆర్ఎస్ పార్టీయేననే విషయాన్ని మర్చిపోవద్దని కార్యకర్తలకు సూచించారు.
సభలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్‌రెడ్డి, రేగా కాంతారావు, వనమా వెంకటేశ్వరరావు, బానోతు హరిప్రియ, మెచ్చా నాగేశ్వరరావు, బానోతు మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు, కొండబాల కోటేశ్వరరావు, జడ్పీ, డీసీసీబీ, సుడా, ఖమ్మం ఏఎంసీ, సత్తుపల్లి మున్సిపాలిటీ మాజీ చైర్మన్లు లింగాల కమల్‌రాజు, కూరాకుల నాగభూషణం, బచ్చు విజయ్‌కుమార్, ఆర్జేసీ కృష్ణ, కూసంపూడి మహేశ్, బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, పార్టీ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటేటి కిరణ్‌కుమార్, రాయల శేషగిరిరావు కుమారులు రేవంత్, రఘునందన్, మండల నాయకులు రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, కనగాల వెంకట్రావు, పాలెపు రామారావు, లక్కినేని అలేఖ్య, లెనిన్, దొడ్డపునేని శ్రీనివాసరావు, చెక్కిలాల మోహన్‌రావు, కట్టా అజయ్‌బాబు, దుగ్గిదేవర వెంకట్‌లాల్ తదితరులు పాల్గొన్నారు.