రఘునాథపాలెం, ఫిబ్రవరి 2: రేషన్ షాపుల వద్ద కోటా బియ్యం కోసం వినియోగదారులు క్యూలో నిల్చోడం చూసుంటాం. కానీ ఇప్పుడు రేషన్ బియ్యం కోసం డీలర్లు గోదాముల వద్ద క్యూ కడుతున్నారు. ఇదేమిటి చోద్యం అనుకుంటున్నారా? గత ఆర్నెల్లుగా ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ బియ్యాన్ని షాపులకు చేర్చడం రేషన్ డీలర్లకు కత్తిమీద సామైంది. ఇందుకు జిల్లా అధికారుల వైఫల్యమే ప్రధాన కారణం. జిల్లాకు సరిపడా రేషన్ బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్లకు తెప్పించడంలో జరుగుతున్న జాప్యం కారణంగా సమస్య ఉత్పన్నమవుతున్నదనే విమర్శలు ఉన్నాయి.
ఫలితంగా రేషన్ బియ్యం షాపులకు ఆలస్యంగా చేరుకోవడంతో జిల్లావ్యాప్తంగా వేల సంఖ్యలో వినియోగదారులు ప్రతి నెలా బియ్యం తీసుకోకుండానే ఉండిపోతున్నారు. ఈ సమస్య గత నెల వరకు ఖమ్మం జిల్లాలోనే కనిపించింది. ఫిబ్రవరి నెల రాష్ట్రవ్యాప్తంగా ఉన్నదని అధికారులే బాహాటంగా చెబుతుండడం గమనార్హం. గోదాముల్లో ఎక్కడా బియ్యం లేకపోవడంతోనే ఈ సమస్య ఉత్పన్నమవుతున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా గోదాములన్నీ నిండుకున్నాయనే విమర్శలున్నాయి.
ఫిబ్రవరి నెలకుగాను ఖమ్మం అర్బన్ ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రేషన్ బియ్యం షాపులకు చేరవేయడంలో గోదాం ఇన్చార్జి మాధవి మార్పులు చేశారు. గతంలో ప్రతి నెలా మొదటగా ఖమ్మం నగరం నుంచి వచ్చిన రేషన్ డీలర్లకు ఎంఎల్ఎస్ పాయింట్‌కు చేరిన బియ్యాన్ని పూర్తి మొత్తంగా సరఫరా చేసేవారు. కానీ, ఎంఎల్ఎస్ పాయింట్‌కు బియ్యం లోళ్లు తక్కువగా వస్తుండడంతో ఇబ్బందులను గుర్తించిన ఇన్చార్జి. రేషన్ షాపులకు మొత్తం ఉన్న కోటాను రెండు భాగాలుగా విభజించి సరఫరా చేసేలా నిర్ణయించారు.
ఖమ్మం అర్బన్ ఎంఎల్ఎస్ పాయింట్ పరిధిలో మొత్తం 94 మంది డీలర్లు ఉండగా.. నాలుగు ప్రాంతాలుగా విభజించి లాటరీ పద్ధతిన సరఫరా చేస్తున్నారు. ఈ పద్ధతిన బియ్యం సరఫరాలో మరింత ఆలస్యమవుతున్నదని పలువురు డీలర్లు వాపోతున్నారు. ప్రతి నెలా రేషన్ పంపిణీ సమయానికి ముందే అధికారులు పెద్ద మొత్తంగా బియ్యం లారీలను గోదాములకు తరలించి షాపులకు చేరవేస్తే ఇన్ని ఇబ్బందులు ఉండవనే అభిప్రాయాలను డీలర్లు వ్యక్తం చేస్తున్నారు. రేషన్ బియ్యం షాపులకు చేరడంలో జాప్యం జరుగుతుండడంతో డీలర్లు నిత్యం ఎంఎల్ఎస్ పాయింట్ వద్దకు చేరుకుంటున్నారు.
బియ్యం లోళ్లు రాలేదని ఇన్చార్జి చెప్పడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. కొంతమంది డీలర్లు బియ్యం లోళ్లు వస్తాయనే ఆశతో గంటలకొద్దీ ఎంఎల్ఎస్ పాయింట్ వద్దనే పడిగాపులు గాస్తున్నారు. ఇలా బియ్యం కోసం ప్రతి నెలా డీలర్లకు గోదాముల వద్ద, వినియోగదారులకు రేషన్ షాపుల వద్ద పడిగాపులు తప్పడం లేదు. ఈ అస్తవ్యస్థ విధానం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే ఏర్పడిందని పలువురు రేషన్ డీలర్లు, వినియోగదారులు అంటున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ప్రతి నెలా రేషన్ షాపులకు బియ్యం చేరవేయడంలో జరుగుతున్న జాప్యాన్ని పరిష్కారాన్ని చూపాలని కోరుతున్నారు.