రఘునాథపాలెం, డిసెంబర్ 15 : ‘పోర్టబిలిటీ’ రేషన్‌బియ్యం షాపులకు చేరకపోవడంతో రేషన్ డీలర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. రేషన్ కోసం షాపుల చుట్టూ నిత్యం తిరుగుతున్న లబ్ధిదారులకు సమాధానం చెప్పలేక విసుగెత్తి ఖమ్మంఅర్బన్ ఎంఎల్ఎస్ గోదాం ఎదుట సోమవారం నిరసనకు దిగా రు. ఈ నెల గడువు ముగుస్తున్నప్పటికీ గోదాము నుంచి రేషన్ తోలకాలు చేపట్టకపోవడంతో చేసేదిలేక రేషన్‌డీలర్లు ఆందోళన చేశారు.
సుమారు నాలుగు గంటలపాటు నిరసన వ్యక్తంచేసినా గో దాం తెరిచేందుకు అధికారులు, సిబ్బంది ఎవ్వరూ రాకపోవడంతో యూనియన్ నేతలు జిల్లా సివిల్ సైప్లె అధికారి, డిస్ట్రిక్ట్ మేనేజర్‌ను కలిసి తమ గోడు ను వెల్లబోసుకున్నారు. నిత్యం రేషన్‌షాపులకు బియ్యం కోసం వచ్చే లబ్ధిదారులకు సమాధానం చెప్పలేకపోతున్నామని, ప్రతినెలా ఎదురయ్యే ఈ సమస్యకు పరిష్కారం చూపాలని వేడుకున్నారు.
రేషన్‌కార్డు కలిగిన ఏ ఒక్క లబ్ధిదారు కూడా రేషన్ సరుకులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం ‘పోర్టబిలిటీ’ సిస్టంను అందుబాటులోకి తెచ్చింది. దీనిద్వారా లబ్ధిదారులు రాష్ట్రంలో ఏ రేషన్‌డీలర్ వద్ద నుంచైనా రేషన్‌బియ్యం పొందవచ్చు. రేషన్‌డీలర్లు తమ షాపు పరిధిలో ‘పోర్టబిలిటీ’ సరుకులను అంచనా వేసి ఈ పాస్మిషన్లో గల ‘పోర్టబిలిటీ’ ఆప్షన్ ద్వారా జిల్లా పౌరసరఫరాల అధికారికి అదనపు ‘రేషన్’ కోసం రిక్వెస్ట్ పెడతారు.
డీలర్లు కోరిన మేరకు సదరు అధికారి పోర్టబిలిటీ రిక్వెస్ట్‌ను అప్రూవల్ చేసి షాపులకు రేషన్ పంపిణీ అయ్యేలా చేస్తారు. కానీ ఏడాదికాలంగా పోర్టబిలిటీ రేషన్ పంపిణీ డీలర్లకు తలనొప్పిగా మారింది. పోర్టబిలిటీ రిక్వెస్ట్ పెట్టినా రేషన్ వస్తుందో..? రాదో..? తెలియని పరిస్థితి నెలకొంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి ఉత్పన్నంకాలేదని పలువురు రేషన్‌డీలర్లు అంటున్నారు. లబ్ధిదారులు రేషన్ కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారని, మా కోసం కేటాయించిన బియ్యం.. మాకెందుకు ఇయ్యరని డీలర్లను నిలదీసిన సందర్భాలు అనేకం ఉన్నాయని డీలర్లు ఆవేదన చెందుతున్నారు. కొందరు ఘర్షణకు సైతం దిగుతున్నారని వాపోతున్నారు.
రేషన్‌షాపు అలాట్మెంట్ పూర్తయిన వెంటనే డీలర్లు ప్రతి నెలా 8, 9వ తేదీల్లోగా పోర్టబిలిటీ రిక్వెస్ట్ పెట్టుకుంటారు. అధికారి 10వ తేదీకల్లా అప్రూవల్ చేసి షాపులకు రేషన్ దిగుమతిని ప్రారంభిస్తారు. కానీ గత ఏడాదిగా ఈ పరిస్థితి లేకపోయింది. 15వ తేదీ వచ్చినా డిసెంబర్ నెలలో డీలర్లు పెట్టుకున్న పోర్టబిలిటీ రిక్వెస్ట్ అప్రూవల్‌కు నోచుకోలేదు. ఈ నెల షాపులకు అదనపు బియ్యం రాకపోతే కార్డుదారుల నుంచి ఈసడింపులు, ఛీత్కారాలు తప్పవనే భయంలో డీలర్లు ఉన్నారు. అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు పోర్టబిలిటీ రిక్వెస్ట్‌ను గాలికొదిలేసినట్లుగా కనిపిస్తున్నారు.
15వ తేదీ వరకు మాత్రమే రేషన్ పంపిణీ తేదీ గడువు ఉండటంతో షాపు పరిధిలో కార్డుదారుల నుంచి ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయోనని డీలర్లు భయాందోళన చెందుతున్నారు. ప్రతినెలా రేషన్‌షాపులకు చేరాల్సిన బియ్యం పంపిణీలో జరుగుతున్న జాప్యాన్ని పరిష్కరించాలని ఇటీవల రేషన్ అసోసియేషన్ బాధ్యులు డీఎం శ్రీలతను కలిసి విన్నవించినా ఫలితం లేకపోయింది. రెగ్యులర్ బియ్యం ప్రతినెలా 1వ తేదీ, పోర్టబిలిటీ బియ్యం ప్రతినెలా 10వ తేదీలోగా రేషన్‌షాపులకు చేరేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డీలర్లు వేడుకుంటున్నారు.