బోనకల్లు, జూలై 30 : ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న రేషన్ డీలర్ల కమీషన్ వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జాయింట్ సెక్రెటరీ సుంకర రామారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. రేషన్ షాపుల ద్వారా ప్రజలకు డీలర్లు బియ్యం పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన కమీషన్ రేషన్ డీలర్లకు ప్రభుత్వం ఇవ్వక పోవడంతో డీలర్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఏప్రిల్, మే నెలతో పాటు మరో మూడు నెలల కమీషన్ ఇవ్వాల్సి ఉందన్నారు. ఐదు నెలలుగా కమీషన్ ఇవ్వకపోవడంతో రాష్ట్రంలో ఉన్న రేషన్ డీలర్లు షాపుల అద్దెలు కట్టలేక, కుటుంబాన్ని నడిపించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
ఇప్పటికే ఏప్రిల్, మే నెల కమీషన్లు పెండింగ్లో ఉండగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ చేసినట్లు తెలిపారు. రేషన్ డీలర్ల కృషితో తెలంగాణ రాష్ట్రాన్ని రేషన్ బియ్యం పంపిణీలో దేశంలోనే మొదటి స్థానంలో ఉంచినట్లు వెల్లడించారు. రేషన్ డీలర్ల కష్టాన్ని ప్రభుత్వం మరవడం మంచిది కాదని ఆయన హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విదంగా రేషన్ డీలర్లకు కమీషన్ పెంచి గౌరవ వేతనం కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.