కారేపల్లి, ఆగస్టు 23 : మాధారం డోలమైట్ మైన్స్ రైల్వే కాంట్రాక్ట్ కార్మికులకు రెండు నెలలుగా పనులు లేక కార్మిక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని, వారికి పనులు కల్పించాలని టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామయ్య డిమాండ్ చేశారు. శనివారం కారేపల్లి మండలం మాధారంలోని డోలమైట్ మైన్స్ కార్యాలయంలో సివిల్ ఇంజినీర్ ప్రవీణ్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ.. డోలమైట్‌లో కాంట్రాక్ట్ కార్మికులుగా 30 ఏండ్లుగా పని చేస్తున్నారని, వారికి పనులు కల్పించకపోవడంతో జీవనాధారం కోల్పతున్నట్లు తెలిపారు. మైన్స్‌లో రైల్వే పనులు టెండర్ వేసిన టెండర్‌దారుడు వర్క్ అర్డర్ తీసుకోక పోవడంతో మైన్స్ యాజమాన్యం పనులు నిర్వస్తుందన్నారు.
కాంట్రాక్ట్ కార్మికులకు నెలకు 26 రోజుల పని దినాలు కల్పించాల్సి ఉండగా కేవలం 11 రోజులు పనులు కల్పిస్తుందన్నారు. రీ టెండర్ పిలవాల్సిన యాజమాన్యం దానికి చర్యలు తీసుకోవడం లేదన్నారు. వందలాది మందికి ఉపాధి కల్పించిన మాదారం స్టీల్ ప్లాంట్‌ను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అదానీ, అంబానీలకు కట్టపెట్టటానికి నష్టాల బూచి చూపుతున్నారన్నారు. ప్రైవేటీకరణతో కార్మికులకు ఉపాధి కరువవుతుందని, దీనిపై ఐక్య పోరాటాలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదారం స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు షేక్ ఖైరుద్దీన్, బాదావత్ వీరు, రవికుమార్, ఇబ్రహీం, హుస్సేన్, ఈరన్న, లక్ష్మీనారాయణ, కళావతి, ప్రసాద్, షేక్ మీరా, వీరన్న పాల్గొన్నారు.