భద్రాచలం, జూన్ 6 : గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు, గురుకులాలు, ఈఎంఆర్ఎస్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కొత్త మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించనున్నట్లు ఐటీడీఏ పీవో బి.రాహుల్ తెలిపారు. భద్రాచలం ఐటీడీఏ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లాలోని 115 ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు, పీఎంహెచ్ హాస్టళ్లు, 32 గురుకుల విద్యాలయాలకు సరుకుల సరఫరాకు సంబంధించి శనివారం టెండర్ ప్రక్రియ నిర్వహించారు.
278 మంది టెండర్లు దాఖలు చేయగా.. తక్కువ ధరకు కోట్ చేసిన వారికి టెండర్లు దక్కాయి. అనంతరం పీవో మాట్లాడుతూ టెండర్ నిబంధనల ప్రకారం నాణ్యతతో కూడిన సరుకులు సరఫరా చేయాలని, నాసిరకం వస్తువులు సరఫరా చేసినట్లు ఫిర్యాదులు అందితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీడీ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి చందన, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ మధుకర్, ఆర్సీవో గురుకులం అరుణకుమారి, డీఎం జీసీసీ సమ్మయ్య, ఏసీఎంవో రమేశ్, ఏటీడీవో అశోక్‌కుమార్, చంద్రమోహన్, సత్యవతి, భారతీదేవి పాల్గొన్నారు.