దుమ్ముగూడెం, మే 1: కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే బీఆర్ఎస్ లక్ష్యమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు కూడా కేసీఆర్ మళ్లీ సీఎం కావాలన్న ఆశతో, ఆశయంతో ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అబద్ధాల పాలనపై వారంతా ఇప్పటికే విసిగిపోయి ఉన్నారని, రేవంత్‌రెడ్డి పాలన నుంచి విముక్తిని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరంలో శుక్రవారం జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని విమర్శించారు.
భూ దందాలు, అక్రమ మైనింగ్‌తో ప్రజాధనాన్ని కాంగ్రెస్ నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు. పేదల ఇళ్లు కూల్చి రాక్షసానందం పొందుతున్నారని దుయ్యబట్టారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయలేని కాంగ్రెస్ పాలకులు.. తెలంగాణను సాధించి అభివృద్ధి పథంలో నడిపించిన కేసీఆర్‌పై నిందలు వేస్తున్నారని ఆరోపించారు. పైగా, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ పాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు. అందుకే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అందుకని, నాయకులు కూడా ప్రజలను మరింత చైతన్యపరిచి తదుపరి ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు దిశగా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయ సీజన్‌కు ముందుగానే కేసీఆర్ రూ.77 వేల కోట్లు సిద్ధం చేసి రైతుబంధు ఇచ్చేవారని గుర్తుచేశారు. రైతుబీమా పరిహారం రూ.5 లక్షలు కూడా దశ దిన కర్మల్లోపే అందేవని అన్నారు. కానీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో విఫలమైందని విమర్శించారు. యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి ఏర్పడిందని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉందని దుయ్యబట్టారు. కరోనా సమయంలోనూ అప్పటి కేసీఆర్ ప్రభుత్వం రైతు వద్దకే వెళ్లి పంటను కొని 15 రోజుల్లోపు ఖాతాలో నగదు జమ చేసిందని గుర్తుచేశారు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక ఈ మండలంలో ప్రగళ్లపల్లి వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేసి సాగునీరు అందిస్తామని మాట ఇచ్చారు. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన వారిని అనర్హులుగా రుజువు చేసేందుకు సుప్రీంకోర్టు వరకూ వెళ్తామని తేల్చిచెప్పారు. అయితే, ఇక్కడి రైతు వాసురాజు వెదజల్లే పద్ధతిని తెలుసుకొని కేసీఆర్ అతడిని పిలిపించుకొని చర్చించిన విషయాన్ని గుర్తుచేశారు.
బీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ నాయకులు రావులపల్లి రాంప్రసాద్, మానె రామకృష్ణ మాట్లాడుతూ.. మళ్లీ కేసీఆర్ వస్తే దుమ్ముగూడెం మండలానికి సాగునీరు పుష్కలంగా అందుతుందని అన్నారు. అందుకోసం ప్రతి కార్యకర్తా కష్టపడి పని చేయాలని కోరారు. సభ్యత్వ నమోదును ప్రారంభించాలన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ నాయకులు సాగి శ్రీనివాసరాజు, రేసు లక్ష్మి, ప్రబోద్‌కుమార్, కణితి రాముడు, జానీపాషా, దొడ్డి తాతారావు, అయినవోలు పవన్‌కుమార్, ఆకోజు సునీల్, రేపాక పూర్ణచంద్రరావు, అపకా వీర్రాజు, రావులపల్లి పృథ్వీ, లంకా శివ, జోగా బుజ్జి, కొత్తా మల్లేశ్వరరావు, వాగే కృష్ణ, తునికి కామేశ్, వాగి ఖాదర్‌బాబు, మడకం జోగయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.
పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ.. గడిచిన రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని, రాబోయే రెండున్నరేళ్లు కూడా శూన్యంగానే ఉంటుందని విమర్శించారు. అందుకని ఈసారి కచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. కాబట్టి నేతలంతా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు దృష్టిసారించాలని పిలుపునిచ్చారు. ఇకనుంచి ప్రజా సమస్యలపై పార్టీ శ్రేణులన్నీ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.