నకిరేకల్, ఆగస్టు 14 : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగడం లేదని రాష్ట్ర మాజీ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ అన్నారు. నకిరేకల్ మండలానికి చెందిన ఎన్ఎస్యూఐ నాయకుడు ఏకుల గణేశ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆదేశాల మేరకు దూదిమెట్ల సమక్షంలో శుక్రవారం నకిరేకల్‌లో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా బాలరాజు పార్టీలో చేరిన వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్‌ను సీఎం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. నకిరేకల్ నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, స్థానిక సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్య వైఖరితో ప్రజల్లో అసంతృప్తి పెరిగిందన్నారు. ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. నకిరేకల్ నియోకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఏకుల గణేశ్ వంటి యువ నాయకులు బీఆర్ఎస్లో చేరడం పార్టీకి మరింత బలం చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నోముల కేశవరాజు, మాజీ సర్పంచ్ ఏకుల కవిత విజయ్‌కుమార్, మాజీ ఎంపీటీసీ నాగిళ్ల వెంకటయ్య, నోముల గణేశ్, కల్లెపల్లి వెంకన్న, నోముల పాండు, దూదిమెట్ల భిక్షమయ్య, ఏకుల సురేశ్, దూదిమెట్ల లింగయ్య, మురళి తదితరులు పాల్గొన్నారు.