రఘునాథపాలెం, డిసెంబర్ 7: కాంగ్రెస్ పార్టీ సాధారణ ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీల పేరుతో 420 మోసపూరిత హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రఘునాథపాలెం మండలంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ ఆదివారం ఆయన కోటపాడు, కోయచలక గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన సమావేశాల్లో పువ్వాడ మాట్లాడుతూ రెండేళ్ల రేవంత్‌రెడ్డి పాలనలో ప్రజలకు ఒరిగిందేమీలేదన్నారు.
ఉద్యమ నేత కేసీఆర్ 14ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించి పదేళ్ల తన పాలనలో ముఖ్యమంత్రిగా రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లారని గుర్తుచేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళితబంధు, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్ వంటి ఎన్నికల మ్యానిఫెస్టోలో లేని అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ప్రజల మన్ననలు పొందారన్నారు. సబ్బండవర్గాల సంక్షేమానికి అహర్నిశలు కృషిచేసిన మహనీయుడిని కాదనుకొని ఓ మాయలోడిని తీసుకొచ్చి సీటులో కూర్చోబెట్టారని అన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు, రైతులకు ఎలాంటి మేలు జరగలేదన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి రేవంత్‌రెడ్డి కండ్లు తెరిపించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సూచించారు. ఓట్ల కోసం గ్రామాలకు వస్తున్న కాంగ్రెస్ నాయకులను 420 హామీలపై నిలదీయాలన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకుంటే ప్రతిపక్షంగా ప్రభుత్వంపై పోరాడి నిధులు సాధించుకునే హక్కులను సాధించుకుంటామన్నారు.
ఈక్రమంలో మండలంలో బీఆర్ఎస్ పార్టీ సత్తా ఏంటో అధికార పక్షానికి అవగతం అవుతుందన్నారు. ఆయా సమావేశాల్లో మండల సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షుడు మాదంశెట్టి హరిప్రసాద్, మాజీ వైస్ ఎంపీపీ గుత్తా రవి, మాజీ మండల రైతుబంధు కన్వీనర్ దొంతు సత్యనారాయణ, వడ్డే ప్రసాద్, చెరుకూరి భిక్షమయ్య, మేళ్లచెరువు శివయ్య, మాజీ సర్పంచ్‌లు కొంటెముక్కల వెంకటేశ్వర్లు, రామారావు, నున్నా శ్రీనివాసరావు, నున్నా వెంకటేశ్వర్లు, తోట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.