ఖమ్మం, జూలై 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముగ్గురు మంత్రులు, ఆరు కళ్లతో చేయలేని ఖమ్మం జిల్లా అభివృద్ధిని తాను చేసి చూపించానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. తాను తాను చేసిన అభివృద్ధికి దీటుగా అభివృద్ధి చేశామని చెప్పే దమ్ముందా? అని ప్రశ్నించారు. తన శక్తి సామర్థ్యాలు, పోరాట పటిమను చూసిన ఖమ్మం ప్రజలు తనను రెండుసార్లు గెలిపించారని గుర్తుచేశారు. తన ఆహార్యానికి ప్రజలు ప్రాధాన్యం ఇవ్వలేదని.. అజయ్‌ను అభివృద్ధికి చిరునామాగానే భావించారని అన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలుసుకోలేకపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు.
ఖమ్మంలోని తన నివాసంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చింతకాని మండలం జగన్నాథపురంలో శుక్రవారం జరిగిన ‘రైతు ఆశీర్వాద సభ’లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనపై పని గట్టుకొని వ్యక్తిగత విమర్శలు, అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు తావుండదని అన్నారు. తాను ఏ వ్యాఖ్య, విమర్శ చేసినా పార్టీ క్రమశిక్షణకు లోబడే మాట్లాడుతానని అన్నారు. వ్యక్తిత్వ హననం చేసే వ్యాఖ్యలను తాను కూడా చేయగలనని అన్నారు. అలాగే, ముఖ్యమంత్రి గురించి, మంత్రుల గురించి తనకూ మాట్లాడడం వచ్చని, కానీ ఆ సంస్కారాన్ని తాను కోల్పోనని అన్నారు.
రైతు ఆశీర్వాద సభలో పాల్గొన్న రాష్ట్ర రైతులకు, జిల్లా ప్రజలకు ఏవిధమైన ప్రయోజనం చేకూరుస్తానోననే విషయాన్ని, భవిష్యత్తులో ఏయే పథకాలు అమలు చేస్తానో అనే విషయాన్ని చెప్పని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. బీఆర్ఎస్ నేతలను వ్యక్తిగతంగా దూషించడానికే పరిమితంకావడాన్ని జిల్లా ప్రజలు గమనించారని అన్నారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఈ రెండున్నరేళ్లలో చేసిన అభివృద్ధి కన్నా ఒంటికన్నుతో తానే ఎంతో అభివృద్ధి చేశానని గుర్తుచేశారు.
అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో రూ.వేల కోట్లతో నిధులు తెచ్చి ఖమ్మం జిల్లా చరిత్రలో ఎవరూ చేయలేని అభివృద్ధిని చేసి చూపించానని జ్ఞప్తికి తెచ్చారు. తాగు, సాగునీటి అంశాలపై సీఎంకు కనీస అవగాహన లేదనే విషయం మరోమారు తేటతెల్లమైందని విమర్శించారు. మేడిగడ్డలో నీళ్లు నింపితే భద్రాచలం మునిగిపోవడం జరిగే పనికాదని, భారీ వరదల సమయంలో భద్రాచలం వద్ద గోదావరి నది నుంచి 25 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించిందని, మంత్రిగా తాను ఉన్నంతకాలం గోదావరి వరదల్లో ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా పర్యవేక్షించానని గుర్తుచేశారు.
ఉచిత విద్యుత్ తమ పేటెంట్గా కాంగ్రెస్ చెప్పుకోవడం విడ్డూరమని అజయ్ విమర్శించారు. ఉచిత విద్యుత్ గురించి గొప్పగా ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. దాని పాలనలో రోజుకు ఎన్ని గంటలు కరెంటు పోతుందో, ప్రజలు ఏమనుకుంటున్నారో గమనించకపోవడం విచారకరమని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల విద్యుత్ సరఫరా చేసిన ఘనత బీఆర్ఎస్దేనని స్పష్టం చేశారు. 10 ఏళ్లపాటు జనరేటర్ వాడాల్సిన అవసరం ప్రజలకు రాలేదని గుర్తుచేశారు.
కాంగ్రెస్ వచ్చాకే కరెంటు కష్టాలు మొదలయ్యాయని వివరించారు. సీఎం ఏ జిల్లాకు వెళ్తే అక్కడ ఆ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతల, మాజీ మంత్రుల వ్యక్తిత్వ హననం చేసే వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారిందని మండిపడ్డారు. ఈ సమావేశంలో డీసీసీబీ మాజీ అధ్యక్షుడు కూరాకుల నాగభూషణం, బీఆర్ఎస్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు, బచ్చు విజయ్‌కుమార్, ఖమర్, కర్నాటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
భధ్రాచలం, జూలై 11: కాంగ్రెస్ ప్రభుత్వం చింతకానిలో నిర్వహించింది రైతు ఆశీర్వాద సభ కాదని, అది ముఖ్యమత్రి ఆక్రోశ సభ అని బీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ నాయకుడు రావులపల్లి రాంప్రసాద్ ఎద్దేవా చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పక్కన బెట్టి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగడం తగదని ఆయన పేర్కొన్నారు. భద్రాచలంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని గుర్తించిన మహిళలు సభ మధ్య నుంచే వెళ్లిపోయారన్నారు.
సభకు భారీగా జన సమీకరణ చేయాలనుకున్నా 25 వేల కుర్చీలు కూడా నిండలేదంటే ప్రభుత్వం పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు ఇదే నిదర్శనమన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని డ్వాక్రా మహిళలు, స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా మహిళలపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకం ద్వారా 11 విడతల్లో సుమారు రూ.73 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మరి అప్పుడు ఎలాంటి సభలు నిర్వహించలేదని, ప్రజాధనాన్ని వృథా చేయలేదని ఆయన పేర్కొన్నారు.