ఖమ్మం కమాన్‌బజార్, జూలై 30: వర్షాకాలం నేపథ్యంలో ఖమ్మం నగరంలో పారిశుధ్య నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సూచించారు. నగరంలో పలుచోట్ల చెత్త పేరుకుపోవడం, మురుగు కాలువలు పూడుకుపోవడం, వర్షపు నీరు నిల్వ ఉండడం వంటి కారణాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. పారిశుధ్య కార్మికులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కోరారు. వర్షాకాలంలో పారిశుధ్యంపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తే అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని అన్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. నిల్వ నీరు ఉన్న ప్రాంతాల్లో దోమల నివారణకు ఫాగింగ్, యాంటీ లార్వా మందుల పిచికారీని క్రమం తప్పకుండా నిర్వహించాలని కోరారు. వర్షాకాలంలో ప్రజారోగ్య పరిరక్షణ ప్రభుత్వ ప్రథమ బాధ్యత అని అన్నారు. ఖమ్మం నగరాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉంచేందుకు సమర్థంగా పనిచేయాలని, పారిశుధ్యంపై ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.